దత్తత పేరుతో పుట్టుకొస్తున్న సంస్థలు

by  |
Stop illegal adoption of kids orphaned by Covid
X

దిశ, ఏపీ బ్యూరో: సెకండ్ వేవ్‌లో కరోనా ఎన్నో కుటుంబాలను అల్లకల్లోలం చేసింది. చాలా కుటుంబాలు ఇంటి పెద్ద మరణంతో బతుకు భరోసా కోల్పోయి నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ముక్కపచ్చలారని చిన్నారులు దిక్కులేనివారయ్యారు. ఏ ఆధారం లేక ఎవరి ఆదరణ నోచుకోలేక ఒంటరివారయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా వల్ల 30 వేల మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు ఆయా ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం సైతం తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు రూ.10 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలువురికి ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను పలువురు దత్తత తీసుకుంటున్నారు. కొందరు అయితే సోషల్ మీడియాలో కొవిడ్‌తో అనాథలైన చిన్నారులను తాము దత్తత తీసుకుంటామని ఎక్కడైనా ఉంటే తెలియజేయాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పోస్టులపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.

పిల్లలను దత్తత తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరుతున్నారు. అధికారికంగా దత్తత అంటే.. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) గైడ్‌లైన్స్ ప్రకారం మాత్రమే దత్తత తీసుకోవాలని విజయనగరం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సభ్యులు పి.చిట్టిబాబు సూచిస్తున్నారు. చాలామంది కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను పక్కింటి వాళ్లో, తెలిసిన వాళ్లో, రక్త సంబంధీకులు దత్తత తీసుకుంటున్నారని అది చెల్లదని చెప్పుకొస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న చెల్లదని తెలిపారు.

జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆక్ట్ ప్రకారం, కారా గైడ్‌లైన్స్ ప్రకారం దత్తత ఇచ్చేందుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ప్రతీ జిల్లాలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఏ అనాథ పిల్లలైనా సీడబ్ల్యూసీ ముందు ప్రవేశపెట్టి లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ అని డిక్లేర్ చేసిన తర్వాత దత్తత ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా దత్తత తీసుకుంటే అటు పేరెంట్స్‌కు, ఇటు చిన్నారులకు చట్ట బద్ధమైన రక్షణ, భద్రత కల్పిస్తుందంటున్నారు. కారా గైడ్‌లైన్స్ పాటించకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని దత్తత తీసుకున్నామని చెప్తే అది చెల్లదని విజయనగరం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సభ్యులు పి. చిట్టిబాబు చెప్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలపై జిల్లాలోనూ రాష్ట్రంలోనూ పలు కేసులు నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.

chittibabu

మరోవైపు అనాథ చిన్నారుల కోసం ప్రభుత్వాలు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉంది. వారికి ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేయడంతోపాటు వారి కోసం సంరక్షకులను కేటాయించాలి. తిండి, బట్ట, చదువు, వైద్య వంటి అంశాల్లో వారికి ఎలాంటి లోటు రానీయకుండా వారికి భవిష్యత్‌పై భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అనాథలైన పిల్లలను వారి బంధువుల వద్ద ఉంటామంటే వారికి చేయూత నివ్వాలి. ఇకపోతే థర్డ్ వేవ్‌ చిన్నారులపట్ల తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వాలు మరింత అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Next Story

Most Viewed