కోలుకుంటున్న ‘డ్రాగన్’

by  |

దిశ, వెబ్‌డెస్క్: చైనా గతరెండు నెలలుగా కరోనావైరస్‌తో కొట్టుమిట్టాడుతున్నది. గతేడాది చివరిలో హుబెయి ప్రావిన్స్‌లోని వుహాన్‌లో ఈ వైరస్ వెలుగుచూసింది మొదలు.. చైనీయులు ముప్పుతిప్పలు ఎదుర్కొన్నారు. వుహాన్ నగరంలో అడుగడుగునా ఆంక్షలు అమలయ్యాయి. చైనా ప్రభుత్వమూ వెనువెంటనే భారీ ఆస్పత్రుళ్లు నిర్మించింది. వైరస్ వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తీసుకుంది. రెండు నెలలుగా కల్లోలం సృష్టించిన ఈ వైరస్‌కు కళ్లెం వేయడంలో చైనా ప్రభుత్వం విజయం సాధించినట్టే కనిపిస్తున్నది.

కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఇప్పుడు చైనా స్థానంలో యూరప్ వచ్చి చేరింది. యూరప్ దేశాలు కరోనావైరస్‌తో విలవిలాడుతుండగా.. డ్రాగన్ దేశం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నది. దేశంలో అంతర్గత రాకపోకలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. వైద్యసేవల కోసం హుబేయికి చేరిన మొదటి బ్యాచ్ నాలుగువేల మంది వైద్య సిబ్బంది వెనక్కిమళ్లుతున్నారు. హుబేయి ప్రావిన్స్‌లో ఇప్పుడు కరోనావైరస్ పాజిటివ్ కేసులు సుమారు పదివేలకు తగ్గింది. దేశంలోని 34 ప్రావిన్స్‌లలో 13 ప్రావిన్స్‌లు వైరస్ రహితంగా మారాయి.

చైనాలో వైరస్ సోకినవారి సంఖ్య సుమారు 81వేలుగా నమోదైంది. అయితే, ఇందులో ఇంచుమించు 69వేల మంది తిరిగి కోలుకున్నారు. ఇప్పుడు చైనాలో యాక్టివ్ కేసులు దాదాపు 12వేలకు పడిపోయాయి. అదీగాక, వైరస్‌కు కేంద్రంగా నిలిచిన చైనాలో స్థానికంగా నమోదయ్యే కేసుల కంటే.. బయటి దేశాల నుంచి దిగుమతవుతున్న కేసులే అధికంగా ఉంటున్నాయి. గత ఐదు రోజులుగా స్థానికంగా పాజిటివ్‌గా తేలిన కేసుల కంటే.. విదేశాల నుంచి వైరస్‌ను వెంటబెట్టుకొచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. సోమవారం దేశీయంగా ఒక్క కరోనాకేసు నమోదవ్వగా.. 20 కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలోనే వెలుగుచూశాయి. బుధవారం మధ్యాహ్నం వరకు నమోదైన 11 కేసులు విదేశాల నుంచి దిగుమతి అయినవే కావడం గమనార్హం. ఇందులో ఐదు కేసులు స్పెయిన్ నుంచి, నాలుగు యూకే నుంచి , ఒకటి బ్రెజిల్ నుంచి, ఒకటి లగ్జెంబర్గ్ నుంచి దిగుమతైనట్టు తెలిసింది. అదే రోజు స్థానికంగా రెండు కేసులే నమోదయ్యాయి. అదీగాక, క్వారంటైన్‌లో నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగుతుండటంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

వైరస్‌ను సమూలంగా పారదోలినట్టేనని భావించట్లేదని వుహాన్ నివాసి జెంగ్ యున్‌రు అన్నారు. కానీ, కఠిన దశను మాత్రం దాటామని అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఇప్పటికి సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించి సాధారణ పరిస్థితులకు తోడ్పడతామని తెలిపారు. గత రెండు నెలల కంటే ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయని అన్నారు. టీవీల్లోనూ కరోనావైరస్ వార్తలు చూసి మొహంమొత్తింది కానీ, ఇప్పుడు కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లు పున:ప్రారంభమయ్యాయని వివరించారు.

Tags : coronavirus, china, epicentre, import, outnumbered, hubei, wuhan, quarantine, normalcy



Next Story