యూ వాంట్ ఎనీ థింగ్ !

by Shyam |

<p>దిశ, హైదరాబాద్ : &#8216;శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు..&#8217; అన్నట్లు లాక్‌డౌన్ కాలంలో చిరువ్యాపారులు అనేక రకాల వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. దుకాణం ఎలాగూ మూసేయాలి కాబట్టి షట్టర్లకు ఫోన్ నెంబర్ అంటించి ఫోన్ చేసినవారికి అవసరమైన వస్తువులను సరఫరా చేసే కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా అన్ని దుకాణాలు మూతబడటంతో వ్యాపారస్తులు తమ రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. దుకాణం తెరిచి వ్యాపారం చేసే అవకాశం లేకపోవడంతో ఫోన్ చేసినవారికి మరో [&hellip;]</p>

యూ వాంట్ ఎనీ థింగ్ !
X

దిశ, హైదరాబాద్ :
‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు..’ అన్నట్లు లాక్‌డౌన్ కాలంలో చిరువ్యాపారులు అనేక రకాల వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. దుకాణం ఎలాగూ మూసేయాలి కాబట్టి షట్టర్లకు ఫోన్ నెంబర్ అంటించి ఫోన్ చేసినవారికి అవసరమైన వస్తువులను సరఫరా చేసే కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా అన్ని దుకాణాలు మూతబడటంతో వ్యాపారస్తులు తమ రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. దుకాణం తెరిచి వ్యాపారం చేసే అవకాశం లేకపోవడంతో ఫోన్ చేసినవారికి మరో మార్గంలో సరుకులను అందిస్తున్నారు. ఇలా దుకాణం అద్దె, కరెంటు బిల్లు, ఒకరిద్దరు సిబ్బందికి జీతాలు, నెలవారీ అప్పుల చెల్లింపులు… వంటి అవసరాలకు ఎంతోకొంత వచ్చినా చాలని సర్దుకుంటున్నారు. వ్యాపారం అసలే లేనిదానికన్నా ‘ఆన్ ఫోన్ కాల్’ విధానం మేలని భావిస్తున్నారు. దుకాణం మూసి ఉన్నా దానిమీద ఫోన్ నెంబర్ పోస్టర్‌ను అంటించి ఫోన్ ద్వారా సంప్రదించినవారికి సరుకులను విక్రయిస్తున్నారు. పోలీసుల ఆంక్షలకు ఇలాంటి ఉపాయం చేశారు.

లాక్‌డౌన్‌ కాలంలో నిత్యావసర వస్తువుల దుకాణాలకు ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ, ఆ జాబితాలో లేని దుకాణాలకు మాత్రం తిప్పలు తప్పడంలేదు. బొమ్మలు, ఫ్యాన్సీ, ప్లాస్టిక్ డిస్పోజబుల్స్, స్టేషనరీ వస్తువులను విక్రయించే దుకాణాలు ‘ఆన్ ఫోన్ కాల్’ బిజినెస్ మొదలుపెట్టాయి. దుకాణంలోని సామాను ముందుగానే ఇంటికి తరలించుకోవడమో లేక నాలుగైదు నిమిషాల కోసం తెరిచి వాటిని సప్లయ్ చేయడమో చేస్తున్నారు చిరు వ్యాపారులు. దుకాణం మూసేసినా ఫోన్ చేసినవారికి ఇంటి అడ్రస్ చెప్పి అక్కడే డబ్బులు తీసుకుని డెలివరీ చేస్తున్నారు. మెయిన్ రోడ్డుమీద కాకుండా కాలనీ లోపలి సందుల్లో ఉన్న దుకాణాలు ఇలాంటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాయి. దుకాణం తెరిస్తే పోలీసులు కేసులు పెట్టడం, లాక్‌డౌన్ సమయంలో ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఎపిడమిక్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో ప్రత్యామ్నాయంగా ఇంటి దగ్గరి నుంచే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. దీనికి ముద్దుగా ‘యు వాంట్ ఎనీ థింగ్.. ప్లీజ్ కాంటాక్ట్’ అంటూ స్టిక్కర్లు అంటించి పొట్ట కూటి కోసం కోటి తిప్పలు పడుతున్నారు.

Tags: Corona Effect, Business Shutters Close, Lockdown, If You Want Any Things

Next Story