టీజేఎస్‌కు షాక్

by  |
టీజేఎస్‌కు షాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) షాక్‌నిచ్చింది. ఇప్పటి వరకు కొనసాగిన కామన్ సింబల్స్‌ తొలగించింది. కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితితోపాటు ఆయా పార్టీలకు ఒకే రకమైన గుర్తు (కామన్ సింబల్స్) ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పోటీ చేసే ఏ ఎన్నికల్లో కూడా ఆయా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు కామన్ సింబల్‌ను కేటాయించబోమంటూ స్పష్టం చేసింది. ఈ పార్టీల తరఫున ఎన్నికల బరిలో ఉన్నా స్వతంత్రుల తరహాలోనే గుర్తులను ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులెక్కల అంశంలో ఎస్ఈసీ అనర్హత వేటు వేసింది. దీంతో పలువురు కీలకంగా తిరిగే నేతలు కూడా వచ్చే గ్రేటర్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గుర్తుల అంశంలో ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ పక్షాలకు షాక్‌గానే ఉంటోంది.

సీట్లు రాలేదనే..

ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘంలో గుర్తింపు పొందిన పార్టీకి ఎస్ఈసీ నుంచి కామన్ సింబల్‌ను కేటాయిస్తారు. రాష్ట్రంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనైనా ఈ పార్టీ నుంచి బీఫారం తీసుకున్న అభ్యర్థులు ఎస్ఈసీకి బీఫారం సమర్పించి అదే గుర్తుపై పోటీలో ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీకి దింపిన అభ్యర్థుల్లో 10 శాతం గెలిస్తేనే ఆ పార్టీకి కామన్ సింబల్ యథాతథంగా కొనసాగుతోంది. అంటే ఈ ఏడాది జనవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 3,112 వార్డుల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ 311 వార్డులను గెలువాల్సి ఉంది. 10 శాతం స్థానాలు గెలుచుకోని పార్టీలకు కామన్ సింబల్ తొలగించాలని నిబంధనల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే కామన్ సింబల్స్ తొలగించామంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు ముందుగా నోటీసులు జారీ చేసి దీనిపై అభిప్రాయం చెప్పాలని కోరింది. కానీ, ఏ పార్టీ నుంచి సమాధానం రాలేదు. దీంతో పలు పార్టీలకు కామన్ సింబల్స్ తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. గుర్తుల తొలగింపునకు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. ఈ తొలగింపు ప్రక్రియ ఐదేండ్లు ఉంటుందని, 2025 జనవరి 7 వరకు ఉంటుందని, అప్పటి వరకు ఈ పార్టీలకు కామన్ సింబల్ ఉండదని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

అగ్గిపెట్టే పోయింది..

అర్బన్, లోకల్, పంచాయతీ ఎన్నికల్లో 10 శాతం కూడా సీట్లు రాని పార్టీలకు గుర్తులను తొలగించిన జాబితాలో తెలంగాణ జన సమితితోపాటు పలుపార్టీలు ఉన్నాయి. టీజేఎస్ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు అగ్గిపెట్టు గుర్తు కామన్ సింబల్‌గా కొనసాగుతూ వస్తుంది. అయితే, స్థానిక సంస్థల్లో కేవలం 48 స్థానాల్లో మాత్రం గెలవడంతో అగ్గిపెట్టేను కామన్ సింబల్‌గా తొలగించారు. సమాజ్‌వాడీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కామన్ సింబల్‌గా కత్తెర గుర్తు ఉండేది. ఈ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం 6 స్థానాల్లోనే గెలిచింది. దీంతో కామన్ సింబల్ కత్తెర తీసేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు ఉండగా దాన్ని తొలగించారు. ఈ పార్టీకి స్థానిక సంస్థల్లో ఒకే సీటు దక్కింది. జన శంఖారావం పార్టీకి కామన్ సింబల్‌గా బ్యాట్ గుర్తు ఉండగా..అది కూడా తొలగించారు.

ఈ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలువలేదు. ప్రజా సేన పార్టీకి కామన్ సింబల్‌గా కప్ సాసర్ గుర్తును తీసేశారు. ఈ పార్టీ స్థానిక సంస్థల్లో నాలుగు సీట్లు గెలుచుకుంది. మన తెలంగాణ రాష్ట్ర సమైఖ్య పార్టీకి కామన్ సింబల్ ఈల గుర్తు ఉండగా తొలగించారు. ఈ పార్టీ స్థానిక సంస్థల్లో 9 స్థానాలు గెలిచింది. యువ తెలంగాణ పార్టీకి కామన్ సింబల్‌గా గ్యాస్ సిలిండర్ ఉంటే తీసేశారు. ఈ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 సీట్లు గెలిచింది. వీటితో పాటు పలు పార్టీలకు కామన్ సింబల్స్ తొలగించారు. ఈ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదని, దీంతో వారి డిపాజిట్ సొమ్మును కూడా విడుదల చేయడం లేదని ఎస్ఈసీ ప్రకటించింది. ఇక ఎస్ఈసీలో కార్మిక తెలంగాణ రైతు సమితి పార్టీ నూతనంగా రిజిస్టర్ అయిందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఈ పార్టీ తరఫున పోటీ చేయొచ్చని ఆఫీసర్లు వెల్లడించారు.


Next Story