తెలంగాణ డీజీపీకి ఎస్టీ నేషనల్ కమిషన్ నోటీసులు..

by  |
st
X

దిశ, సిటీ బ్యూరో: సూర్యపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలో వీర శేఖర్ అనే గిరిజన యువకుడ్ని గత నెల 11వ తేదీన చేయని తప్పును చేసినట్లు అంగీకరించాలంటూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన‌కు సంబంధించిన సమగ్ర నివేదికలను అందజేయాలని ఆదేశిస్తూ నేషనల్ ఎస్టీ కమిషన్ రాష్ట్ర డీజీపీ, సూర్యపేట జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా విజిలెన్స్ , మానిటరింగ్ కమిటీ సభ్యుడు బత్తుల రాంప్రసాద్ గత నెల 18న సమర్పించిన ఫిర్యాదు మేరకు కమిషన్ విచారణ చేయాలని నిర్ణయించినట్లు, ఇందుకు‌గాను నోటీసులు అందుకున్న 30 రోజుల్లోపు ఘటనకు సంబంధించిన వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను కమిషన్‌కు అందజేయాలని సూచించింది.

చేయని తప్పును చేసినట్లు అంగీకరించాలంటూ గిరిజన యువకుడ్ని గోడ కుర్చీ వేయించటంతో పాటు మూత్రాన్ని తాగించి చిత్ర హింసలకు గురి చేసినట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు బాధితుడికి న్యాయం చేసేందుకు డిల్లీ వెళ్లి కమిషన్ కు ఫిర్యాదును సమర్పించినట్లు రాంప్రసాద్ వెల్లడించారు. ఈ విషయాన్ని కమిషనర్ కూడా నోటీసులో పేర్కొంది. కమిషన్ నిర్ణయించిన గడువులోపు డీజీపీ, ఎస్పీ, కలెక్టర్ నివేదికను పోస్టు ద్వారా గానీ నేరుగా గానీ, ఇతర మాధ్యమాల ద్వారా గానీ కమిషన్ కు సమర్పించాలని, లేని పక్షంలో రాజ్యాంగంలోని 338ఏ ఆర్టికల్ ప్రకారం వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేయనున్నట్లు కమిషన్ నోటీసులో రీసర్చ్ ఆఫీసర్ వై.కే.బన్సల్ స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకోవటం పట్ల రాష్ట్ర పోలీసులెలా స్పందిస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.


Next Story