నాలుగేళ్ల తరువాత..!

by  |
నాలుగేళ్ల తరువాత..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ ఈ సీజన్‎లో ప్రజలకు సాగునీరు, తాగు నీరు అందించడంతో పాటు విద్యుత్​ ఉత్పత్తి లక్ష్యాన్ని ముందే చేరుకుంది. వానాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆగస్టు నుంచే అధికారులు నాలుగు టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ ఏడాది టార్గెట్ 50 మెగా యూనిట్ల విద్యుత్​ ఉత్పత్తి కాగా, మంగళవారం వరకే 51.24 మెగా యూనిట్ల ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని చేరుకుంది. ఆశించిన మేర వర్షాలు కురవడం, ప్రాజెక్టులోకి ఇంకా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఏడాది పొడవునా ఎస్కేప్ గేట్ల ద్వారా అధికారులు విద్యుత్ ​ఉత్పత్తి కొనసాగించనున్నట్లు సమాచారం.

నాలుగు టర్బైన్ల ద్వారా ..

ఎస్సారెస్పీ జల విద్యుత్ కేంద్రంలో రోజుకు నాలుగు టర్బైన్ల ద్వారా మొత్తం 0.875 మెగా యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది. మొదటి యూనిట్ ద్వారా 0.221 మెగావాట్లు, రెండో యూ నిట్ ద్వారా 0.221, మూడో యూనిట్ ద్వారా 0.221, నాలుగో యూనిట్ ద్వారా 0.212 మెగా యూనిట్లు విద్యుత్ కొనసాగుతోంది. ఆగస్టు నుంచి మంగళవారం వరకు 19.8336 మెగా యూనిట్ల ఉత్పత్తి జరిగినట్లు డీఈ శ్రీనివాస్​ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90.313 టీఎంసీల నీరు ఉంది. దీంతో అధికారులు టీడీ ద్వారా 8500 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో కేసీడీకి 3000 క్యూసెక్యులు, ఎస్కేప్ గేట్లకు 5500 క్యూసె క్యుల నీటిని విడుదల చేశారు.

2016 తరువాత మళ్లీ ఇప్పుడు..

2016 లో కురిసిన వర్షాలకు ఎస్సీరెస్పీ జలవిద్యుత్ ​కేంద్రంలో 75 మెగా యూనిట్ల విద్యుత్​ఉత్పత్తి జరిగింది. ఆ తరువాత ఎగువ ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీలో ఉంది. గత ఏడాది అక్టోబర్ లో కురిసిన వర్షాలతో 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు చేరడంతో తక్కువ సమయంలోనే 51.2465 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. యాసంగిలో కూడా విద్యుత్ ఉత్పత్తికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఆ సీజన్ లో కాకతీయ కాలువకు నీటిని విడుదల చేస్తే ఉత్పత్తి కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

నిండుకుండలా ఎస్సారెస్పీ

మహారాష్ట్రతోపాటు ప్రాజెక్ట్ పరీవాహక ప్రాం తాల్లో కురిసిన వర్షాలకు ఎస్సారెస్పీ జలకళ ను సంతరించుకుంది. ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం ఇన్ ఫ్లో 25,359 క్యూసెక్కులు కాగా, ఆవుట్ ఫ్లో 25,359 క్యూసెక్యులుగా ఉంది. కాకతీయ కెనాల్​ద్వారా 3000, సరస్వతీ కెనాల్​ద్వారా 500, లక్ష్మీ కెనాల్​ద్వారా 150, వరదకాలువ ద్వారా 3000, ఎస్కేప్ గేట్ల ద్వారా 5500, ఆవిరి రూపంలో 557, ఫ్లడ్​గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్తోంది. ఈ సంవత్సరం ప్రా జెక్టులో మంగళవారం నాటికి 90.313 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గడి చిన ఏడాది ఇదే రోజు 89.763 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ రోజు వరకు ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి 223.98 టీఎంసీల నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed