నిత్యవసర వస్తువుల రేట్లకు రెక్కలు.. చక్కెర కిలో రూ. 200 ?

278

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా మహమ్మారి విజృంభణతో చాలా దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. ఈ క్రమంలో అన్ని వస్తువుల్లో కొరత ఏర్పడటంతో ధరలు పెరిగిపోతున్నాయి. కానీ, నిత్యవసర వస్తువులు దొరక్క ధరలన్నీ ఒకేసారి రెండు, మూడు రెట్లు పెరుగుతాయని ఎప్పుడైనా అనుకున్నారా.? రూ.40కి కేజీ ఉన్న కిలో చక్కర ధర రూ.200కి కొనాల్సి వస్తుందని కలలోనైనా అనుకున్నారా?.. ఇప్పుడు శ్రీలంకలో ఇదే పరిస్థితి ఉంది.

అవును శ్రీలంకలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. బియ్యం, పంచదార, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, కిరోసిన్‌, పాల పౌడరు వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ధరలు రెండింతలు పెరిగాయి. దీంతో, ఏకంగా కిలో చక్కర రూ.200 అయింది. దీంతో శ్రీలంక ప్రజలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో అని భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ముందుగానే అవసరానికి మించి నిత్యవసర వస్తువులను కొనేందుకు దుకాణాలకు పోటెత్తారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో ఆ దేశాధ్యక్షుడు గోటాబాయా రాజపక్సే ఆహార అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతేకాకుండా దీనిని క్యాష్ చేసుకున్న దుకాణాదారులు కొన్ని నిత్యవసరాలపై కృత్రిమ కొరతను సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వీరిపై శ్రీలంక ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

అలాంటి వారిని గుర్తించి ఇప్పటికే జరిమానాలను విధిస్తున్నారు. అయితే, శ్రీలంకలో ఇలా ఆహార సంక్షోభం రావడానికి గల కారణాలను అన్వేషించగా.. ప్రభుత్వ తప్పిదాలే అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దేశానికి దిగుమతుల ద్వారా సంవత్సరానికి 400 మిలియన్ డాలర్లను పొదుపు చేయాలనే ఉద్దేశ్యంతో అక్కడి ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పంట సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని నిషేధించాలని రైతులకు సూచించింది.

అయితే, రసాయనిక ఎరువుల బదులు సేంద్రియ ఎరువులు వాడాలని రైతులను ప్రోత్సహించింది. కానీ, పంట దిగుబడులు పెద్దగా రాకపోవడంతో ఈ సంవత్సరం తేయాకు ఉత్పత్తి సగానికిపైగా పడిపోయింది. సేంద్రియ ఎరువుల వ్యూహం బెడిసికొట్టడంతో మిగతా పంటల ఉత్పత్తులు కూడా తీవ్ర స్థాయిలో పడిపోవడంతో ఆహార సంక్షోభానికి దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..