చాహల్‌ నీకు హ్యాట్సాఫ్.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో గాయంతోనే బౌలింగ్ చేసిన స్పిన్నర్

by Harish |

కోల్‌కతానైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసిన విషయం తెలిసిందే.

చాహల్‌ నీకు హ్యాట్సాఫ్.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో గాయంతోనే బౌలింగ్ చేసిన స్పిన్నర్
X

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతానైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసిన విషయం తెలిసిందే. 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని సంచలనం సృష్టించింది . దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా పంజాబ్ రికార్డు నెలకొల్పింది. పంజాబ్ విజయంలో ఆ జట్టు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌‌ కీలక పాత్ర పోషించాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కోటాలో 28 పరుగులకే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రహానె, రఘువంశీ, రింకు సింగ్, రమణ్‌దీప్ వంటి కీలక బ్యాటర్లను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో పంజాబ్‌కు అపురూప విజయాన్ని అందించాడు. చాహల్ స్పిన్ మాయతో కోల్‌కతా 95 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు చాహల్ గాయపడ్డాడట. మ్యాచ్‌లోనూ అతను గాయంతోనే బరిలోకి దిగాడట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపారు.

ఈ నెల 12న సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో చాహల్ గాయపడ్డాడు. క్యాచ్ అందుకోవడానికి డైవ్ చేశాడు. అప్పుడు అతనికి భుజానికి గాయమైంది.కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి వరకు అతను అందుబాటులో ఉంటాడో లేడో తెలియని పరిస్థితి అని అర్ష్‌‌‌దీప్ తెలిపాడు. అయితే, మ్యాచ్‌కు ముందు అతనికి ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించారు. అతను ఫిట్‌గా ఉన్నాడని తేలడంతో పంజాబ్ జట్టు ఊపిరి పీల్చుకుంది. బౌలింగ్ చేయడానికి అతను ఫిట్‌గానే ఉన్నా భుజం నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్‌లో కూడా నొప్పి భరిస్తూనే చాహల్ బౌలింగ్ చేశాడని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. గాయాన్ని కూడా లెక్కచేయకుండా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన చేసిన చాహల్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.


Next Story