- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు అందుకున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి శుక్రవారం (డిసెంబర్ 26) చిరస్మరణీయమైన రోజుగా నిలిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి శుక్రవారం (డిసెంబర్ 26) చిరస్మరణీయమైన రోజుగా నిలిచింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డును అందుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ అవార్డును న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ప్రదానం చేశారు. భారతదేశంలో 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు క్రీడలు, వీరత్వం, వినూత్న ఆలోచనలు, విజ్ఞానం, సామాజిక సేవ, సంస్కృతి వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 20 మంది పిల్లలను ఈ అవార్డుకు ఎంపిక చేయగా, అందులో వైభవ్ సూర్యవంశీ ఒకరిగా నిలిచారు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరుకావాల్సి రావడంతో వైభవ్, బిహార్ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీ (VHT) 2025–26 సీజన్‌లో రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అంతకుముందు మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై వైభవ్ అద్భుతమైన 190 పరుగుల ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా, కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలందరినీ అభినందిస్తూ, ‘మీ విజయాలు దేశానికి స్ఫూర్తినిస్తాయి. ఇలాంటి ప్రతిభావంతుల వల్లే భారత్ ప్రపంచంలో మెరుగ్గా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. పిల్లల విజయంలో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్రను కూడా ఆమె ప్రశంసించారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో వైభవ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఆయన పూర్తి దృష్టి ఇప్పుడు అండర్-19 క్రికెట్‌పైనే ఉంది. జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే అండర్-19 వరల్డ్ కప్‌కు భారత అండర్-19 జట్టులో వైభవ్‌కు చోటు దక్కుతుందని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.






