వరల్డ్ కప్ తర్వాత ఆ ఏడుగురి కెరీర్ నాశనం.. బీసీసీఐపై యోగ్‌రాజ్ ఆగ్రహం

by Phanindra |   (  Updated:2025-06-16 14:40:30  IST  )

2011 వరల్డ్ కప్ తర్వాత ఏడుగురు ప్లేయర్ల కెరీర్ నాశనమైందని, దీనికి బీసీసీఐ సెలెక్టర్లే కారణమని యోగ్‌రాజ్ ఆగ్రహం వ్యక్తంచేశాడు.

వరల్డ్ కప్ తర్వాత ఆ ఏడుగురి కెరీర్ నాశనం.. బీసీసీఐపై యోగ్‌రాజ్ ఆగ్రహం
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ మరోసారి బీసీసీఐపై మండిపడ్డాడు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఏడుగురు టీమిండియా క్రికెటర్ల కెరీర్లను సెలెక్టర్లు నాశనం చేశారని యోగ్‌రాజ్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. అప్పటి చీఫ్ సెలెక్టర్ మొహిందర్ అమర్‌నాథ్ తదితరులను తిట్టిపోశాడు. ‘బీసీసీఐ సెలెక్టర్లు ఎలాంటి కారణం లేకుండా ఈ కుర్రాళ్ల కెరీర్ నాశనం చేశారు. గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహమ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్.. 2011 తర్వాత ఈ ఏడుగురి కెరీర్ ముగింసింది’ అని యోగ్‌రాజ్ గుర్తుచేశాడు.

2011 తర్వాత ఈ జట్టును సెలెక్టర్లు నాశనం చేశారని, ఇలాంటి కారణాల వల్లే జట్టు ఇబ్బందుల్లో పడిందని అన్నాడు. అప్పటి వరల్డ్ కప్ విజయం తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీసుల్లో భారత్ వైట్ వాష్ చవిచూసింది. దీంతో కెప్టెన్‌గా ధోనీని కూడా తప్పించాలని అమర్‌నాథ్ అనుకున్నాడని, అయితే అప్పటి బీసీసీఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ దీన్ని అడ్డుకున్నాడని యోగ్‌రాజ్ చెప్పాడు. ఒక ప్లేయర్ను నమ్మితే అతనికి మద్దతుగా నిలబడాలని, అంతేకానీ ఇలా చేయకూడదని అన్నాడు. కాగా, టెస్టు సిరీసుల ఓటమి తర్వాత లక్ష్మణ్, ద్రావిడ్ రిటైర్ అయిపోయారు. జహీర్, హర్భజన్, యువరాజ్, గంభీర్‌ నెమ్మదిగా జట్టుకు దూరమయ్యారు.

Next Story