ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో యోగేశ్ సింగ్‌కు స్వర్ణం

by Harish |

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ రైఫిల్, పిస్టోల్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది.

ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో యోగేశ్ సింగ్‌కు స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ రైఫిల్, పిస్టోల్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది. ఆదివారం మరో రెండు స్వర్ణ పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ ఈవెంట్‌లో షూటర్ యోగేశ్ సింగ్ విజేతగా నిలిచాడు. 20 మంది పాల్గొన్న ఈ ఈవెంట్‌లో యోగేశ్ 572 స్కోరుతో మంగోలియా షూటర్ దవాఖు ఎంక్టాయివాన్(572), కజకిస్తాన్‌కు చెందిన చిరుకిన్ నికిత(568)లను వెనక్కినెట్టాడు. మంగోలియా షూటర్ దవాఖు ఎంక్టాయివాన్ సైతం 572 స్కోరుతో సమంగా నిలువగా.. ‘ఎక్స్’ వద్ద 17సార్లు షూట్ చేసిన యోగేశ్‌ను స్వర్ణం వరించింది. అలాగే, ఇదే ఈవెంట్‌లో టీమ్ కేటగిరీలోనూ భారత్ స్వర్ణం గెలిచింది. యోగేశ్ సింగ్(572), అమిత్ కుమార్(565), ప్రకాశ్ ఓం(553)ల త్రయం మొత్తం 1,690 స్కోరుతో విజేతగా నిలిచింది. తాజాగా రెండు స్వర్ణాల చేరికతో ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 32కు చేరింది. ఇందులో 14 స్వర్ణాలు, 10 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. పాయింట్స్‌ టేబుల్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. చైనా(16), సౌత్ కొరియా(14) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Next Story