పార్లమెంట్ ముందు మహాపంచాయత్‌కు రెజ్లర్ల పిలుపు

by Disha Web Desk 2 |
పార్లమెంట్ ముందు మహాపంచాయత్‌కు రెజ్లర్ల పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్ద మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. వివిధ రాష్ట్రాల కాప్ పంచాయతీలు, రైతులు, మల్లయోధులు మద్దతుదారులు రెజ్లర్ల మద్దతులో పాల్గొనున్న నేపథ్యంలో తిక్రీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి అంతరాయం కలిగించేలా రెజ్లర్ల నిరసనకు, మార్చ్‌కు అనుమతి లేదని ఢిల్లీ పోలీసు స్పెషల్ సీపీ దీపేందర్ పాఠక్ తెలిపారు.

అయితే రెజ్లర్లు మాత్రం పోలీసులు హెచ్చరికలను లెక్కచేయడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త భవనం దగ్గరే తమ మహిళా మహాపంచాయతీ నిర్వహించి తీరుతామని అన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు మౌలానా ఆజాద్ రోడ్, ఐటీఓ రోడ్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులను రాజధానిలోకి ప్రవేశించకుండా పంచాయితీ ఏర్పాటు చేయడాన్ని అడ్డుకునేందుకు పోలీసులు నగరానికి వెళ్లే సరిహద్దులన్నింటినీ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ భవనం అత్యంత భద్రత ఉన్న ప్రాంతంలో ఉందని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘాజీపూర్ సరిహద్దులో 144 సెక్షన్ విధించినట్లు, చట్టాలను ఉల్లంఘించవద్దని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నిరసనకారులను హెచ్చరించారు. కాగా, ఆందోళనకారుల రూపంలో అసాంఘిక శక్తులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందంటూ ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.


Next Story

Most Viewed