ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న యూపీ.. డబ్ల్యూపీఎల్‌లో ఆలస్యంగా బోణీ

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ ఆలస్యంగా బోణీ కొట్టింది.

ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న యూపీ.. డబ్ల్యూపీఎల్‌లో ఆలస్యంగా బోణీ
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ ఆలస్యంగా బోణీ కొట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత గెలుపు ఖాతా తెరిచింది. గత మ్యాచ్‌లో ఓటమికి ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రతీకారం తీర్చుకుంటూ విజయఢంకా మోగించింది. బెంగళూరు వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా హెన్రీ(62) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 177/9 స్కోరు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 144 స్కోరుకే ఆలౌటైంది. యూపీ బౌలర్లు గ్రేస్ హ్యారిస్, క్రాంతి గౌడ్ చెరో నాలుగు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఆరంభంలోనే కెప్టెన్ మెక్ లానింగ్(5) వికెట్ కోల్పోవడంతో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్రీజులోకి వచ్చిన రోడ్రిగ్స్(56) కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే, మరో ఎండ్‌లో ఆమెకు సహకారం కరువైంది. షెఫాలీ వర్మ(24) క్రీజులో ఉన్నా అది కాసేపే. మారిజన్నె కాప్(9), సదర్లాండ్(5), జొనాస్సెన్(5), సారాహ్ బ్రైస్(5) విఫలమవడంతో రోడ్రిగ్స్ ఒంటరి పోరాటం చేసింది. యూపీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆమె హాఫ్ సెంచరీతో మెరిసింది. ఆ కాసేపటికే రోడ్రిగ్స్‌ను క్రాంతి గౌడ్ అవుట్ చేయడంతో ఢిల్లీ కాస్త ఆశలు కూడా ఆవిరయ్యాయి. ఇక, ఆఖరి ఓవర్‌లో గ్రేస్ హ్యారిస్ రెచ్చిపోయింది. హ్యాట్రిక్ వికెట్లు తీసింది. వరుసగా నిక్కీ ప్రసాద్(18), అరుంధతి రెడ్డి(0), మిన్ను మణి(0)లను పెవిలియన్ పంపడంతో ఢిల్లీ కుప్పకూలింది.

యూపీని ఆదుకున్న హెన్రీ

యూపీ 177 పరుగుల స్కోరు చేసిందంటే చినెల్లె హెన్రీనే కారణం. హెన్రీ ఆదుకోకపోయి ఉంటే యూపీ కథ మరోలా ఉండేది. ఢిల్లీ స్పిన్నర్ జొనాస్సెన్‌ స్పిన్ మాయకుతోడు మారిజన్నె కాప్, తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి చెలరేగడంతో యూపీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. కిరణ్ నవ్‌గిరే(17), వ్రింద దినేశ్(4), కెప్టెన్ దీప్తి శర్మ(13), శ్వేతా సెహ్రావత్(11), గ్రేస్ హ్యారిస్(2), ఉమా చెత్రి(3) క్రీజులో నిలువలేకపోయారు. తహిలా మెక్‌గ్రాత్(24) విలువైన పరుగులు జోడించగా.. ఆమె అవుటయ్యే సమయానికి యూపీ 109/7తో నిలిచింది. మరో 10-20 రన్స్ చేసి ఆలౌటవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆఖరి ఓవర్లలో హెన్రీ ఢిల్లీ బౌలర్లపై పిడుగుల్లే పడింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆమె సిక్సర్ల మోత మోగించింది. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి డబ్ల్యూపీఎల్ సంయుక్తంగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును నెలకొల్పింది. మొత్తంగా 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 62 రన్స్ చేసి యూపీకి పోరాడే స్కోరు అందించి ఆఖరి ఓవర్‌లో చివరి బంతికి అవుటైంది.


Next Story