- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL 2025 : దంచికొట్టిన స్మృతి మంధాన.. ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వడోదర వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో ఢిల్లీ 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. రోడ్రిగ్స్(34) టాప్ స్కోరర్. ఆర్సీబీ బౌలర్లలో రేణుక సింగ్(3/23), జార్జియా వారేహమ్(3/25) సత్తాచాటి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అనంతరం ఛేదనలో స్మృతి మంధాన(81) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోవడంతో ఆర్సీబీ అలవోకగా గెలుపొందింది. వ్యాట్ హోడ్జ్(42) కూడా రాణించింది. దీంతో ఆర్సీబీ 16.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 146 రన్స్ చేసి విజయతీరాలకు చేరింది.
దంచికొట్టిన స్మృతి మంధాన
తొలి మ్యాచ్‌లో నిరాశపర్చిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఢిల్లీ బౌలర్లను ఊచకోతకోసింది. ఛేదనలో ఆమె విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు కొట్టి దూకుడును మొదలుపెట్టిన ఆమె ఎడాపెడా బౌండరీలు దంచింది. ఈ క్రమంలో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఆమెకుతోడు వ్యాట్ హోడ్జ్ కూడా రాణించింది. వీరిద్దరూ ఢిల్లీ బౌలర్లను పరుగులు పెట్టించారు. దీంతో 10 ఓవర్లలోనే 100 దాటింది. అయితే, తెలుగమ్మాయి, ఢిల్లీ బౌలర్ అరుంధతి రెడ్డి.. వ్యాట్ హోడ్జ్(42) ఈ జోడీని విడదీసింది. వ్యాట్ అవుటైనా స్మృతి మంధాన దూకుడు కొనసాగించడంతో ఆర్సీబీ విజయానికి చేరువైంది. మరోవైపు, ఆమె కూడా సెంచరీ చేసేలా కనిపించింది. అయితే, శిఖా పాండే బౌలింగ్‌లో స్మృతి మంధాన వికెట్ పారేసుకోగా.. రిచా ఘోష్(11 నాటౌట్), ఎల్లీస్ పెర్రీ(7 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు.
141 రన్స్‌కే ఢిల్లీ ఆలౌట్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆర్సీబీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయింది. అతి కష్టం మీద 141 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టులో రోడ్రిగ్స్(34) మాత్రమే కాస్త పోరాటం చేయగా.. మిగతా వారు క్రీజులో నిలువలేకపోయారు. తొలి ఓవర్‌లోనే షెఫాలీ(0) డకౌటవడంతో భారమంతా రోడ్రిగ్స్‌పైనే పడింది. బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, ఆమె దూకుడు ఎంతో సేపు లేదు. జర్జియా వారేహమ్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. రోడ్రిగ్స్ అవుటైన తర్వాత ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. సారాహ్ బ్రైస్(23) విలువైన రన్స్ జోడించగా.. లానింగ్(17), సదర్లాండ్(19), మారిజన్నె కాప్(12), జొనాస్సెన్(1) నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో రేణుక, వారేహమ్ మూడేసి వికెట్లతో విజృంభించగా.. కిమ్ గార్త్, ఎక్తా బెస్ట్ చెరో 2 వికెట్లతో సత్తాచాటారు.






