- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WPL : చెలరేగిన రిచా ఘోష్.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్సీబీ విక్టరీ
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ శుక్రవారం మొదలైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లీగ్‌లో శుభారంభం చేసింది.

దిశ, స్పోర్ట్స్ : వాటే మ్యాచ్.. ఫోర్లకు కొదవలేదు. సిక్స్‌ల మోత మోగింది. తొలి మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. ఆరంభం అంటే ఇది కదా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఓపెనింగ్ మ్యాచ్‌తోనే అభిమానులకు ఫుల్ మజా అందించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ మధ్య హోరాహోరీ పోరుతో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్‌కు తెరలేసింది. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది.
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ శుక్రవారం మొదలైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లీగ్‌లో శుభారంభం చేసింది. వడోదారా వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. ముందుగా గార్డ్‌నెర్(79 నాటౌట్), బెత్ మూనీ(56) రాణించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 201/5 స్కోరు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని బెంగళూరు మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 202 స్కోరు చేసింది. రిచా ఘోష్(64 నాటౌట్), ఎల్లీస్ పెర్రీ(57), కనిక ఆహుజ(30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. గుజరాత్ కెప్టెన్ గార్డ్‌నెర్(79, 2/33) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసినా జట్టును గెలిపించలేకపోయింది.
గార్డ్‌నెర్ మెరుపులు
ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ 5వ వర్‌లో ఓపెనర్ లారా వొల్వార్డ్ట్(6)ను రేణుక క్లీన్ బౌల్డ్ చేసింది. కాసేపటికే హేమలత(4) కూడా వెనుదిరిగడంతో గుజరాత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయి తడబాటుకు గురైంది. అయితే, మరో ఓపెనర్ బెత్ మూనీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అర్ధ శతకంతో రాణించింది. కానీ, కాసేపటికే ఆమె వెనుదిరిగింది. ఆ తర్వాత గార్డ్‌నెర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్స్‌తో రెచ్చిపోయింది. ఆర్సీబీ బౌలర్లను ఊచకోతకోసింది. ప్రేమ రావత్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టింది. ఏ బౌలర్‌ను వదలకుండా సిక్స్‌ల మోత మోగించింది. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. మొత్తంగా 37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 79 పరుగులతో అజేయంగా నిలిచింది. డెయాండ్రా డాటిన్(25) కాసేపు క్రీజులో ఉన్నా ధాటిగా ఆడింది. గార్డ్‌నెర్ చివరి వరకూ నిలబడటంతో గుజరాత్ స్కోరు 200 మార్క్‌ను దాటింది.
పేలవ ఆరంభం నుంచి..
ముందుగా ఆర్సీబీకి దక్కిన ఆరంభం చూస్తే 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందని ఎవరూ అనుకుని ఉండరు. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన(9), వ్యాట్ హోడ్జ్(4) దారుణంగా నిరాశపరిచారు. వీరిద్దరిని గార్డ్‌నెర్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ పంపింది. దీంతో ఆర్సీబీ 14 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయింది. ఆ పరిస్థితి నుంచి బెంగళూరు కోలుకుంటుందన్న ఆలోచన రావడం కూడా కష్టమే. కానీ, ఎల్లీస్ పెర్రీ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి జట్టును పోటీలోకి తీసుకుంది. ఆమెకు రఘ్వి బిస్ట్(25) సహకరించింది. దీంతో 11వ ఓవర్‌లో స్కోరు 100లో పడింది. అయితే, స్వల్ప వ్యవధిలోనే రఘ్వి బిస్ట్, పెర్రీ అవుటవడంతో ఆర్సీబీకి షాక్ తగిలినట్టైంది. కానీ, రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్‌కు మ్యాచ్ మలుపు తిరిగింది. గార్డ్‌నెర్ వేసిన ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో 23 రన్స్ పిండుకుంది. చివరి వరకూ ఆమె అదే జోరు కొనసాగించింది. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. ఆమెతోపాటు కనిక ఆహుజ కూడా మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ విజయం మరింత తేలికైంది. 14 నుంచి 18 ఓవర్ల మధ్య వీరిద్దరూ 82 పరుగులు రాట్టడంతో 18.3 ఓవర్లలోనే ఆర్సీబీ గెలుపు తీరాలకు చేరింది.






