WPL 2025 : ముంబై ఖాతాలో మరో విజయం.. ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన గుజరాత్

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది.

WPL 2025 : ముంబై ఖాతాలో మరో విజయం.. ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన గుజరాత్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై.. గుజరాత్ జెయింట్స్‌ను మట్టికరిపించి వరుసగా రెండో విజయాన్ని, మొత్తంగా ఐదో గెలుపును రుచిచూసింది. ముంబై వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో 9 రన్స్ తేడాతో గెలుపొందింది. ముందుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(54) హాఫ్ సెంచరీకితోడు నాట్ స్కివర్ బ్రంట్(38), అమన్‌జోత్ కౌర్(27), హేలీ మాథ్యూస్(27) విలువైన రన్స్ జోడించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో గుజరాత్ 170 పరుగులకు ఆలౌటైంది. భారతి ఫుల్మాలి(61, 25 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సంచలన పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయింది. ముంబై, గుజరాత్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. అయితే, ఈ విజయంతో ముంబై ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆర్సీబీతో జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే నేరుగా టైటిల్ పోరుకు అర్హత సాధించనుంది.

భారతి పోరాడినా..

ఛేదనలో గుజరాత్‌పై ముంబై బౌలర్లు మొదటి నుంచే ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా హేలీ మాథ్యూస్, అమేలియా కెర్ మూడేసి వికెట్లతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టారు. దీంతో ఓపెనర్లు బెత్ మూనీ(7), కాశ్వీ గౌతమ్(10)లతోపాటు కెప్టెన్ గార్డ్‌నెర్(0) నిరాశపర్చగా.. హర్లీన్ డియోల్(24), లిచ్‌ఫీల్డ్(22), డెయాండ్రా డాటిన్(10) ఎక్కువ సేపు క్రీజులో లేరు. దీంతో గుజరాత్ 92/6తో గుజరాత్ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో భారతి ఫుల్మాలి మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ముంబై బౌలర్లను ఊచకోతకోసిన ఆమె ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు దంచింది. ఈ క్రమంలోనే 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. భారతి మెరుపులతో గుజరాత్ జట్టులో ఆశలు చిగురించాయి. కానీ, 17వ ఓవర్‌లో భారతి దూకుడుకు అమేలియా కెర్ చెక్ పెట్టింది. అయితే, సిమ్రాన్ షక్(18), తనూజ(10) విలువైన రన్స్ జోడించడంతో ఆఖరి ఓవర్‌‌లో గుజరాత్‌కు 13 రన్స్ అవసరమయ్యాయి. చివరి ఓవర్‌ను హేలీ మాథ్యూస్ అద్భుతంగా వేయగా.. తనూజ, సిమ్రాన్ షేక్, ప్రియా మిశ్రా వికెట్లు పారేసుకోవడంతో గుజరాత్ ఆలౌటైంది.

హర్మన్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్

అంతకుముందు ముంబై జట్టులో హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. అమేలియా కెర్(5) నిరాశపర్చగా..హేలీ మాథ్యూస్(27) ఎంతో సేపు క్రీజులో లేదు. ఆమె అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్‌ దూకుడుగా ఆడింది. హాఫ్ సెంచరీతో రాణించింది. చివరి ఓవర్‌ వరకూ నిలిచి ముంబైకి మంచి స్కోరు కట్టబెట్టింది. నాట్ స్కివర్ బ్రంట్(38)‌తో కలిసి 59 రన్స్ జోడించింది. హర్మన్‌కుతోడు అమన్‌జోత్ కౌర్(27), సజన(11), యాస్తికా భాటియా(13) విలువైన రన్స్ జోడించడంతో ముంబై 179 రన్స్ చేసింది.

Next Story