- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఆలస్యంగా బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. వడోదర వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. నాట్ స్కివర్ బ్రంట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించింది. ముందుగా గుజరాత్ నిర్ణీ 20 ఓవర్లలో 120 రన్సేకే ఆలౌటైంది. హర్లీన్ డియోల్(32) టాప్ స్కోరర్. ముంబై బౌలర్లు హేలీ మాథ్యూస్(3/16), నాట్ స్కివర్ బ్రంట్(2/26), అమేలియా కెర్(2/22) బంతితో మెరిసి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ముంబై 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాట్ స్కివర్ బ్రంట్(57) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముంబై పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.
పేలవ ఆరంభం నుంచి..
ఛేదనలో ముంబైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు హేలీ మాథ్యూస్(17), యాస్తికా భాటియా(8) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్(4) కూడా నిరాశపర్చింది. ఈ సమయంలో నాట్ స్కివర్ బ్రంట్ మాత్రం చెలరేగింది. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఎడాపెడా ఫోర్లు కొట్టింది. ఆమె ఇన్నింగ్స్ 11 ఫోర్లు ఉన్నాయి. ఒక వైపు వికెట్లు పడుతున్నా ఆమె మాత్రం దూకుడు ఆపలేదు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. అయితే, కాసేపటికే ప్రియా మిశ్రా ఆమె జోరుకు బ్రేక్ వేసింది. ఆమె అవుటయ్యే సమయానికి ముంబై విజయానికి కావాల్సినవి పరుగులు మాత్రమే. సజన(10 నాటౌట్), కమలిని(4 నాటౌట్) మిగతా పని పూర్తి చేయడంతో లీగ్‌లో ముంబై గెలుపు ఖాతా తెరిచింది.
గుజరాత్ విలవిల
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇన్నింగ్స్ చివరి వరకూ తడబడుతూనే సాగింది. ముంబై బౌలర్లు కలిసి కట్టుగా ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఆరంభంలోనే గుజరాత్‌కు వరుసగా షాక్‌లు తగిలాయి. బెత్ మూనీ(1), వొల్వార్డ్ట్(4), హేమలత(9), కెప్టెన్ గార్డ్‌నెర్(10), డెయాండ్రా డాటిన్ దారుణంగా నిరాశపరిచారు. దీంతో గుజరాత్ 43 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో హర్లీన్ డియోల్(32) కీలక ఇన్నింగ్స్ ఆడింది. కాశ్వీ గౌతమ్(20)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించింది. అలాగే, తనూజ(13) సహకారంతో స్కోరును 100 దాటించి అవుటైంది. చివరి ఓవర్‌లో ఆఖరి బంతికి ప్రియా మిశ్రా(2) రనౌటవడంతో గుజరాత్ ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు, నాట్ స్కివర్ బ్రంట్, అమేలియా కెర్ చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు.
- Tags
- #WPL 2025






