- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
wpl 2025 : గార్డ్‌నెర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. గెలుపు ఖాతా తెరిచిన గుజరాత్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) గుజరాత్ జెయింట్స్ ఆలస్యంగా బోణీ కొట్టింది.

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) గుజరాత్ జెయింట్స్ ఆలస్యంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను మట్టికరిపించి గెలుపు ఖాతా తెరిచింది. వడోదరా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయడంతో గెలుపు కోసం ఎక్కువగా కష్టపడలేదు. ముందుగా యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 143/9 స్కోరు చేసింది. కెప్టెన్ దీప్తి శర్మ(39) పర్వాలేదనిపించింది. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి చేధించింది. గార్డ్‌నెర్(52) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో.. డెయాండ్రా డాటిన్(33 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించారు. హర్లీన్ డియోల్(34 నాటౌట్) కూడా రాణించింది.
గార్డ్‌నెర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
ఛేదనలో గుజరాత్‌కు ఆరంభంలో వరుసగా షాక్‌లు తగిలాయి. బెత్ మూనీ(0), హేమలత(0) డకౌటవడంతో ఆ జట్టు 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ పరిస్థితుల్లో క్రీజలోకి వచ్చిన గార్డ్‌నెర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. ఫోర్లు, సిక్స్‌లు దంచిన ఆమె హాఫ్ సెంచరీతో రాణించింది. వొల్వార్డ్ట్(22)తో కలిసి మూడో వికెట్‌కు 55 రన్స్ జోడించింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్‌తో కలిసి 29 రన్స్ చేసింది. అర్ధ శతకం తర్వాత గార్డ్‌నెర్ దూకుడుకు బ్రేక్ పడింది. గార్డ్‌నెర్ రాణించడంతో గుజరాత్ విజయానికి దారులు సుగమయ్యాయి. ఆ తర్వాత డెయాండ్రా డాటిన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. హర్లీన్ డియోల్ సహకారంతో రెచ్చిపోయిన ఆమె మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే గుజరాత్ విజయతీరాలకు చేర్చింది.
బౌలర్లు సమిష్టిగా..
అంతకుముందు గుజరాత్ బౌలర్లు కూడా సమిష్టిగా రాణించారు. దీంతో యూపీ భారీ స్కోరు చేయలేకపోయింది. యూపీ జట్టులో కెప్టెన్ దీప్తిశర్మ(39) టాప్ స్కోరర్. మొదటి నుంచి ఆ జట్టు తడబడుతూనే ఉంది. ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కిరణ్(15) రెండో ఓవర్‌లోనే వికెట్ పారేసుకోగా.. ఆ తర్వాతి ఓవర్‌లోనే వ్రింత(6) అవుటైంది. అనంతరం దీప్తి, ఉమా చెత్రి(24) ఇన్నింగ్స్ నిర్మించారు. 51 పరుగులు భాగస్వామ్యం జతచేశారు. దీంతో యూపీ 73/2 మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ సమయంలో గుజరాత్ బౌలర్లు బలంగా పుంజుకుని దెబ్బ మీద దెబ్బకొట్టారు. దీంతో యూపీ 44 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయింది. శ్వేత(16), అలానా కింగ్(19 నాటౌట్), సైమా ఠాకూర్(15) విలువైన పరుగులు జోడించడంతో యూపీ కష్టంగా 143 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో ప్రియ 3, డెయాండ్రా డాటిన్, గార్డ్‌నెర్ చెరో 2 వికెట్లతో సత్తాచాటారు.
- Tags
- #wpl 2025






