- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WPL 2025 : ఆఖరి బంతికి తెలుగమ్మాయి అద్భుతం.. ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఢిల్లీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది.

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. ముంబై ఇండియన్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. చివరి బంతి వరకూ విజయం ఊగిసలాడన మ్యాచ్‌లో గెలుపు చివరికి ఢిల్లీనే వరించింది. వడోదరా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా ముంబై 19.1ఓవర్లలో 164 రన్స్ చేసి ఆలౌటైంది. నాట్ స్కివర్ బ్రంట్(80 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్(42) రాణించారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ విజయం కోసం చెమటోడ్చింది. 165 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది. షెఫాలీ వర్మ(43) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. నికీ ప్రసాద్(35), సారాహ్ బ్రైస్(21) విలువైన పరుగులు జోడించారు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి(2 నాటౌట్) చివరి బాల్‌కు రెండు రన్స్ తీసి ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించింది. దీంతో చివరి వరకూ పోరాడిన ముంబైకి నిరాశే మిగిలింది.
చివరి బంతి వరకూ..
ఛేదనలో ఢిల్లీకి దక్కిన ఆరంభం చూస్తే 15 లేదా 16 ఓవర్లలోనే విజయం దక్కుతుందని అనిపించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(43) రెచ్చిపోవడంతో ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభం దక్కింది. మెక్ లానింగ్(19) తక్కువ స్కోరే చేసినా షెఫాలీ మాత్రం ముంబై బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించింది. దీంతో 5 ఓవర్లలోనే స్కోరు 60 దాటింది. ఈ సమయంలో ముంబై బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీశారు. 16 పరుగుల వ్యవధిలోనే షెఫాలీ, లానింగ్‌లతోపాటు రోడ్రిగ్స్(2), సదర్లాండ్(13) వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత అలైస్ కాప్సీ(16) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 109 స్కోరుకు ఢిల్లీ ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో నికీ ప్రసాద్(35), సారాహ్ బ్రైస్(21) కీలక ఇన్నింగ్స్ ఆడి ఆశలు రేపారు. రాధా యాదవ్(9 నాటౌట్) సహకారంతో నికీ ప్రసాద్ జట్టును విజయం దిశగా నడిపించింది. ఆఖరి ఓవర్‌లో 10 రన్స్ అవసరమవ్వగా.. నికీ ప్రసాద్ తొలి బంతికే ఫోర్ కొట్టడంతో సమీకరణం కాస్త 5 బంతులకు 6గా మారింది. ఆ తర్వాత మూడు బంతుల్లో 4 రన్స్ వచ్చాయి. ఐదో బంతికి నికీ ప్రసాద్ అవుటవడంతో ఇక ఆఖరి బాల్‌కు రెండు రన్స్ కావాల్సి రాగా సూపర్ ఓవర్ తప్పదేమో అనిపించింది. కానీ, ఆఖరి బంతికి అరుంధతి రెడ్డి రెండు పరుగులు తీయడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది.
వాళ్లిద్దరిదే పోరాటం
ముంబై ఇన్నింగ్స్‌లో రాణించింది ఇద్దరే. నాట్ స్కివర్ బ్రంట్(80 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(42). వీరు మినహా మిగతా వారు కనీసం క్రీజులో నిలువలేకపోయారు. ఐదుగురు సింగిల్ డిజిట్‌కు పరిమితమవ్వగా.. ముగ్గురు డకౌటయ్యారు. ఢిల్లీ బౌలర్ శిఖా పాండే మెరవడంతో ఓపెనర్లు హేలీ మాథ్యూస్(0), యాస్తికా భాటియా(11) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. ఆ తర్వాత నాట్ స్కివర్, హర్మన్ జట్టును ఆదుకున్నారు. హర్మన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల మీద బౌండరీలు కొట్టింది. అయితే, తృటిలో ఆమె హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. ఇక, భారమంతా నాట్ స్కివర్ మీదనే పడింది. మరో ఎండ్‌లో ముంబై వరుసగా వికెట్లు కోల్పోగా.. స్కివర్ ఒంటరి పోరాటం చేసింది. స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ముంబై పోరాడే స్కోరు చేసింది. స్కివర్ అజేయంగా నిలువగా.. సైకా ఇషాక్ ఆఖరి వికెట్ కోల్పోవడంతో ముంబై ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లతో సత్తాచాటారు.
- Tags
- #WPL 2025






