అదరగొట్టిన పారా అథ్లెట్లు.. వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో 22 పతకాలు కైవసం

by Harish |

ఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసింది.

అదరగొట్టిన పారా అథ్లెట్లు.. వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో 22 పతకాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసింది. టోర్నీ చరిత్రలోనే భారత్ ఈ సారి అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మొత్తం 22 పతకాలు సాధించింది. ఓ సింగిల్ ఎడిషన్‌లో భారత్‌‌కు ఇవే అత్యధిక మెడల్స్ కావడం విశేషం. టోర్నీ ప్రారంభం నుంచి అదరగొట్టిన మన పారా వీరులు ముగింపు కూడా ఘనంగానే ఇచ్చారు. ఆఖరి రోజు నాలుగు పతకాలు సాధించారు. మహిళా స్ప్రింటర్లు సిమ్రాన్, ప్రీతి పాల్ తమ ఖాతాలో రెండో పతకాన్ని చేర్చుకున్నారు. 200 మీటర్ల టీ12 ఈవెంట్‌లో 24.46 సెకన్లలో రేసును ముగించి ఆసియా రికార్డు నెలకొల్పడంతోపాటు రజతం గెలిచింది. ఇప్పటికే సిమ్రాన్ 100 మీటర్ల టీ12 ఈవెంట్‌లో స్వర్ణం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక 100 మీటర్ల టీ25 ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన ప్రీతి పాల్ 200 మీటర్ల టీ25 ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో 14.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. పురుషుల జావెలిన్ త్రోలో నవ్‌దీప్ 45.64 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. ఇక, పురుషుల 200 మీటర్ల టీ44 ఈవెంట్‌లో సందీప్ కంచుమోత మోగించాడు. 23.60 సెకన్లలో రేసును పూర్తి చేసి బ్రాంజ్ మెడల్ సాధించాడు. భారత్ మొత్తం 22 పతకాలు గెలవగా.. అందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. టోర్నీని భారత్ 4వ స్థానంతో ముగించింది. బ్రెజిల్ 37 పతకాలతో టాప్ పొజిషన్‌లో నిలిచింది.


Next Story