నిఖత్ పసిడి పంచ్.. వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్‌లో బంగారు పతకం కైవసం

by Harish |

భారత స్టార్ బాక్సర్, తెలుగమ్మాయి నిఖత్ జరీన్ అదరగొట్టింది.

నిఖత్ పసిడి పంచ్.. వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్‌లో బంగారు పతకం కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బాక్సర్, తెలుగమ్మాయి నిఖత్ జరీన్ అదరగొట్టింది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న టోర్నీలో ఆమె మహిళల 51 కేజీల కేటగిరీలో విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్‌లో నిఖత్ 5-0 తేడాతో చైనీస్ తైపీకి చెందిన గువో యి జువాన్‌ను మట్టికరిపించింది. బౌట్‌లో పూర్తిగా నిఖత్ ఆధిపత్యమే కొనసాగింది. రింగ్‌ను పూర్తిగా కంట్రోల్ ఉంచుకున్న ఆమె పవర్‌ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిపై ఎటాక్‌కు దిగింది. దీంతో నిఖత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. నిఖత్‌తోపాటు ఇతర మహిళా బాక్సర్లు కూడా సత్తాచాటారు.

మీనాక్షి(48 కేజీలు), ప్రీతి(54 కేజీలు), అరుంధతి చౌదరి(70 కేజీలు), నుపుర్(80+కేజీలు), జాస్మిన్ లంబోరియా(57 కేజీలు), పర్వీన్(60 కేజీలు) కూడా బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుత ఆసియా చాంపియన్ ఫర్జోనా ఫొజిలోవా‌ను 5-0తో మీనాక్షి చిత్తు చేయగా.. జాస్మిన్ చేతిలో 4-1తో పారిస్ ఒలింపిక్ మెడలిస్ట్ వు షిహ్ యి మట్టికరించింది. ప్రీతి 5-0 తేడాతో సిరిన్ చరబీ(ఇటలీ)పై, అరుంధతి 5-0తో అజిజా జోకిరోవా(ఉజ్బెకిస్తాన్)పై, నుపుర్ 3-2తో సోటింబోవా ఓల్టినోయ్‌పై విజయం సాధించారు. మహిళల విభాగంలో 7 గోల్డ్ మెడల్స్ దక్కడం విశేషం.

పురుషుల విభాగంలో సచిన్(60 కేజీలు), హితేశ్(70 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. కిర్గిస్థాన్ బాక్సర్ మునార్‌బెక్ ఉలు సెయిట్‌బెక్‌ను 5-0తో సచిన్ ఓడించగా.. నుర్బెక్ ముర్సల్‌పై 3-2తో హితేశ్ విజయం సాధించాడు. మొత్తం 9 గోల్డ్ మెడల్స్‌తో టోర్నీలో భారత్ చరిత్ర సృష్టించింది. జడుమని సింగ్(50 కేజీలు), పవన్(55 కేజీలు), అభినాష్(65 కేజీలు), అంకుష్ ఫంగల్(80కేజీలు), నరేందర్(90+ కేజీలు), పూజ రాణి(మహిళల 80 కేజీలు) ఫైనల్‌లో ఓడి రజతంతో సరిపెట్టారు.


Next Story