వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ శుభారంభం

by Harish |

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి, భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది.

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి, భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. 51 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన ఆమె శనివారం జరిగిన తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన జెన్నిఫర్ లొజెనా‌ను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన బౌట్‌లో నిఖత్ 5-0 తేడాతో విజయం సాధించింది. నిఖత్ ఏడాది తర్వాత అంతర్జాతీయ వేదికపై పునరాగమనం చేసింది. ప్రత్యర్థిపై ఏమాత్రం కనికరం చూపించలేదు. పవర్‌ఫుల్ పంచ్‌లతో దాడి చేసింది. మూడు రౌండ్లలోనూ ఐదుగురు జడ్జీలు నిఖత్‌కే ఓటు వేశారు. మరోవైపు, టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడిలిస్ట్ లవ్లీనా బోర్గోహైన్(75 కేజీలు) అంచనాలను అందుకోలేకపోయింది. రెండో రౌండ్‌‌లో తుర్కియేకు చెందిన బుస్రా ఇసిల్దార్ చేతిలో 5-0 తేడాతో ఓడిపోయింది. పురుషుల 70 కేజీల కేటగిరీలో హితేశ్ కూడా ఇంటిదారిపట్టాడు. రెండో రౌండ్‌లో అతను నెదర్లాండ్స్‌కు చెందిన బోస్ ఫిన్ రాబర్ట్ చేతిలో 4-1 తేడాతో ఓడిపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌ల్లో జైస్మిన్ లంబోరియా(57 కేజీలు), నరేందర్ బెర్వాల్(90 కేజీలు) తొలి రౌండ్‌లో విజయాలు నమోదు చేశారు. జైస్మిన్ 5-0 తేడాతో డారియా ఓల్హా హుటారినా(ఉక్రెయిన్)‌పై, నరేందర్ 4-1 తేడాతో ఐర్లాండ్‌‌కు చెందిన మార్టిన్ మెక్‌డొనాగ్‌పై నెగ్గారు.


Next Story