- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదిగదిగో కప్పు.. భారత అమ్మాయిలు ఈ సారైనా ఐసీసీ టైటిల్ గెలుస్తారా?
మహిళల ప్రపంచకప్‌లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా మధ్య ఫైనల్ జరగనుంది.

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల క్రికెట్ జట్టు ఏడుసార్లు ఐసీసీ టైటిల్ గెలిచింది. అందులో రెండేసి సార్లు వన్డే వరల్డ్ కప్(1983, 2011), టీ20 వరల్డ్ కప్(2007, 2024) కైవసం చేసుకుంది. మూడుసార్లు చాంపియన్స్ ట్రోఫీ(2002, 2013, 2025) విజేతగా నిలిచింది. కానీ, మహిళల జట్టు పరిస్థితి అందుకు భిన్నం. ఒక్క సారి కూడా విశ్వవిజేతగా నిలువలేదు. ఏళ్లుగా కలల కప్పు కోసం నిరీక్షిస్తూనే ఉంది. అందని ద్రాక్షగానే ఉన్న ఐసీసీ టైటిల్ గెలవడానికి భారత జట్టుకు మరోసారి చాన్స్ వచ్చింది. వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా కప్పుకు అడుగు దూరంలోనే నిలిచింది. కలల కప్పు నిరీక్షణకు తెరదించడానికి భారత్‌కు కావాల్సింది మరో విజయం మాత్రమే. నేడు టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోనుంది. మరి సొంతగడ్డపై టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడుతుందా?
మహిళల ప్రపంచకప్‌లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా మధ్య ఫైనల్ జరగనుంది. ఇరు జట్లు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అయితే, లీగ్ దశలో పర్ఫామెన్స్ పరిశీలిస్తే సౌతాఫ్రికానే కాస్త ముందంజలో ఉంది. లీగ్ దశలో ఆ జట్టు 5 విజయాలు నమోదు చేస్తే భారత్ మూడింటనే గెలిచింది. సౌతాఫ్రికా చేతిలో ఓడిపోవడం గమనార్హం. అలాగే, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల చేతుల్లోనూ పరాజయం పాలైంది. అయితే, సెమీస్‌కు వచ్చేసరికి ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. మరోవైపు, ఇంగ్లాండ్‌ను సఫారీలు చిత్తు చేశారు. రెండు జట్లకు ఈ విజయాలు ఆత్మవిశ్వాసాన్ని నింపేవే. అలాగే, ఇరు జట్లలోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి, ఏ జట్టునూ తక్కువ అంచనా వేయడానికి లేదు. కాకపోతే సౌతాఫ్రికాపై మెరుగైన రికార్డు కారణంగా ఇండియాను ఫేవరెట్‌గా చెబుతున్నారు విశ్లేషకులు. భారతే కాదు సౌతాఫ్రికా కూడా ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఏ జట్టూ విజయం సాధించినా వన్డే వరల్డ్ కప్‌కు కొత్త చాంపియన్ వచ్చినట్టే.
కావాలి అదే పట్టుదల
సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విక్టరీ కచ్చితంగా భారత జట్టులో దీమా, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. గెలుపొందిన తీరు అలాంటింది. ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్ అసాధారణ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హర్మన్‌ప్రీత్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. ఫైనల్‌లోనూ వీరు అదే జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాగే, కొన్ని మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు కూడాఉన్నాయి. ఓపెనర్ ప్రతీక రావల్ లోటు సెమీస్‌లో స్పష్టంగా కనిపించింది. ఆమె స్థానంలో వచ్చిన షెఫాలీ నిరాశపర్చింది. దీంతో స్వేచ్ఛగా ఆడే స్మృతి మంధాన కూడా ఒత్తిడికి గురై త్వరగానే వికెట్ పారేసుకుంది. ఫైనల్‌లో ఈ ఓపెనర్లు జట్టుకు శుభారంభం అందిస్తే ఇతర బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు వీలు ఉంటుంది. ఇక, దీప్తి, రిచా, అమన్‌జోత్‌లు లీగ్ దశలో కొన్ని ఆకట్టుకునే ప్రదర్శనలు చేశారు. ఫైనల్‌లో వీళ్ల భాగస్వామ్యం కీలకం కానుంది. ఇక, బౌలింగ్ పరంగా స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి జట్టుకు అండగా నిలుస్తున్నారు. కానీ, పేసర్ల నుంచి అలాంటి సహకారం లభించడం లేదు. రేణుక, రాధ, క్రాంతి తమ సత్తాచాటాల్సిన అవసరం వచ్చింది. సెమీస్‌లో రాధ భారీగా పరుగులు సమర్పించుకుంది. ఫైనల్ కోసం ఆమె స్థానంలో స్నేహ్ రాణాను తీసుకోవచ్చు.
ప్రత్యర్థిలో వీళ్లతో జాగ్రత్త
సౌతాఫ్రికా జట్టు బలం కెప్టెన్ వొల్వార్ట్. సారథిగా జట్టును విజయవంతంగా నడిపించడమే కాకుండా ప్లేయర్‌గా కూడా సత్తాచాటుతోంది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 169 పరుగుల విధ్వంసాన్ని అంత త్వరగా మర్చిపోలేం. మొత్తంగా 8 మ్యాచ్‌ల్లో 470 స్కోరుతో టోర్నీలో ఆమెనే అత్యధిక పరుగులు చేసింది. ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు బాదింది. ఆమెను వీలైనంత త్వరగా అవుట్ చేస్తే భారత్‌కు పెద్ద గండం తిప్పినట్టే. ఆమె తర్వాత ఆల్‌రౌండర్ కాప్ ప్రమాదకరం. బంతితో, బ్యాటుతో ఆమె సౌతాఫ్రికా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌తోనే భారత్‌కు సవాల్ ఎదురుకానుంది. కాప్, మ్లాబా, సాదియా, డె క్లర్క్ వంటి బౌలర్లు ఆ జట్టులో కీలకం కానున్నారు. బ్యాటర్లు బ్రెట్స్, కాప్, డె క్లెర్క్ ప్రమాదకరమే అయినా వారు నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు. అయినప్పటికీ వాళ్లను భారత్ తక్కువ అంచనా వేయడానికి లేదు.
మూడుసార్లు నిరాశే
విశ్వవిజేత నిలిచేందుకు భారత్‌కు మూడుసార్లు అవకాశం వచ్చినా నిరాశే ఎదురైంది. మొదటిసారి 2005 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరగా భారత్ ఆశలపై ఆస్ట్రేలియా నీళ్లు చల్లింది. 2017లో మరోసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ పోరుకు చేరుకుంది. ఈ సారి ఇంగ్లాండ్ అడ్డు తగిలింది. ఇక 2020 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చేతుల్లోనే చిత్తయ్యింది.
భారత్‌దే పైచేయి
వన్డేల్లో సౌతాఫ్రికాపై భారత్‌దే ఆధిపత్యం. ఇప్పటివరకు ఇరు జట్లు 34 సార్లు ఎదురుపడ్డాయి. అందులో 20 విజయాలతో భారత్‌దే పైచేయి. సౌతాఫ్రికా 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రీసెంట్ పర్ఫామెన్స్ చూసుకున్నా ప్రత్యర్థిపై మనదే స్పష్టమైన ఆధిపత్యం. గతేడాది నుంచి ఇరు జట్లు 6 మ్యాచ్‌లు ఆడితే అందులో ఐదింట భారతే నెగ్గింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో లీగ్ దశలో చివరిసారిగా తలపడగా ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది.






