WPL 2025 : మహిళల ధనాధన్‌కు వేళాయే.. నేటి నుంచే డబ్ల్యూపీఎల్

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు వేళైంది. నేటి నుంచి మూడో సీజన్ ప్రారంభంకానుంది.

WPL 2025 : మహిళల ధనాధన్‌కు వేళాయే.. నేటి నుంచే డబ్ల్యూపీఎల్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు వేళైంది. నేటి నుంచి మూడో సీజన్ ప్రారంభంకానుంది. గత రెండు సీజన్లు విజయవంతం కావడంతో ఈ సారి టోర్నీపై భారీ అంచనాలే ఉన్నాయి. 2023లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవగా.. 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు టైటిల్ నిలబెట్టుకోవడంపై దృష్టిపెట్టింది.

కెప్టెన్ స్మృతి మంధాన, ఎల్లీస్ పెర్రీ, డేనియల్ వ్యాట్, రిచా ఘోష్, కిమ్ గార్త్, రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్,రేణుక సింగ్ జట్లులో కీలక ప్లేయర్లు. తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన ముంబై మరోసారి చాంపియన్‌గా నిలవడంపై దృష్టి పెట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కెర్, హేలీ మాథ్యూస్, యాస్తిక భాటియా, నటాలియా స్కివర్ ముంబైకి బలం. గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మంచి ప్రదర్శన చేసింది. వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరింది. అయితే, రన్నరప్‌గానే సరిపెట్టింది. ఈ సారైనా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీ బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ ఫామ్‌పైనే ఢిల్లీ ఆధారపడింది. తెలుగమ్మాయి, బౌలర్ అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్, రాధా యాదవ్‌ వంటి బౌలర్లతో బౌలింగ్ దళం కూడా పటిష్టంగానే ఉన్నది.

ఇక, గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ఈ సారి సత్తాచాటాలని చూస్తున్నాయి. యూపీ కొత్త కెప్టెన్ దీప్తి శర్మ నాయకత్వంలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ సారి బెంగళూరు, లక్నో, ముంబై, వడోదరా వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూపు దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. అందులో గెలిచిన జట్టు మొదటి టీమ్‌తో ఫైనల్‌లో తలపడనుంది. మార్చి 13న ఎలిమినేటర్, 15న ఫైనల్ జరగనుంది. మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానెల్స్‌లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అలాగే, డిస్నీ+హాట్‌ స్టార్‌లో లైవ్‌స్ట్రీమింగ్ ఉంది. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్నాయి.

Next Story