నేటి నుంచి ఉమెన్స్ వరల్డ్ కప్.. భారత మహిళల జట్టు నిరీక్షణకు తెరదించుతుందా?

by Harish |

భారత మహిళల క్రికెట్ జట్టు ఒక్కసారి కూడా ఐసీసీ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది.

నేటి నుంచి ఉమెన్స్ వరల్డ్ కప్.. భారత మహిళల జట్టు నిరీక్షణకు తెరదించుతుందా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల క్రికెట్ జట్టు ఇప్పటి వరకు 7 ఐసీసీ టైటిల్స్ గెలిచింది. కానీ, మహిళల జట్టు మాత్రం ఒక్కసారి కూడా ఐసీసీ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. 2005, 2017 వరల్డ్ కప్‌లలో, 2020 టీ20 వరల్డ్ కప్‌లో టైటిల్‌కు చేరువైనా ఫైనల్‌ మ్యాచ్‌ల్లో బోల్తా పడింది. దీంతో ఏళ్లుగా ప్రపంచకప్ ముచ్చట కోసం నిరీక్షించక తప్పడం లేదు. ఇప్పుడు భారత్, శ్రీలంక సంయుక్తంగా మహిళల వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. నేటి నుంచే ప్రపంచకప్ మొదలు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఈ సారి కప్పు వదలకూడదని భారత్ పట్టుదలతో ఉంది. మరి, ఈ సారైనా ఆ ముచ్చట తీరుతుందో లేదో చూడాలి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో నేడు శ్రీలంకతో తలపడనుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేసి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తున్నది.

మహిళల అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో భారత్ ప్రదర్శన కొంతకాలంగా గొప్పగా ఉంది. గతేడాది నుంచి మొన్నటి ఆస్ట్రేలియాతో సిరీస్ వరకు 9 వన్డే సిరీస్‌ల్లో పాల్గొంది. అందులో 6 సిరీస్‌లు మనవే. మూడు సిరీస్‌ల్లో ఓటమి పాలవ్వగా.. మూడింటి ఆస్ట్రేలియా చేతుల్లోనే ఓడిపోయింది. అయితే, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లపై సిరీస్‌లు గెలిచింది. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై ఆతిథ్య జట్టును ఓడించి చారితాత్రక సిరీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌లో ఈ సారి భారత జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. సొంతగడ్డపై జరుగుతుండటం అదనపు బలం కానుంది. జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుక సింగ్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇటీవల తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. స్మృతి మంధాన భీకర ఫామ్‌లో ఉంది. ఆస్ట్రేలియాపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసింది. ప్రాతిక రావల్, హర్లీన్ డియోల్‌లు కూడా సామర్థ్యం ఉన్న బ్యాటర్లే. జెమిమా రోడ్రిగ్స్ దూరం కావడం జట్టుకు లోటే.

ఫార్మాట్ ఇలా..

టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ఆడుతున్నాయి. ప్రతి జట్టు మరో టీమ్‌తో ఒక్క మ్యాచ్ ఆడుతుంది. ఇలా గ్రూపు దశ ముగిసే సరికి పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలిచిన జట్టు నాకౌట్ దశకు వెళ్తాయి. అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు జరుగుతుండగా.. నవంబర్ 2న ఫైనల్ జరగనుంది.

భారత్ మ్యాచ్‌లు ఇవే

గ్రూపు దశలో టీమిండియా 7 మ్యాచ్‌లు ఆడనుంది. నేడు తొలి మ్యాచ్‌లో శ్రీలంకను ఎదుర్కోనుంది. ఆ తర్వాత అక్టోబర్ 5న పాకిస్తాన్‌తో, 9న సౌతాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో, 19న ఇంగ్లాండ్‌తో, 23న న్యూజిలాండ్‌తో, 26న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అన్ని మ్యాచ్‌లు భారత్‌కు కీలకమే. ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి, హర్మన్‌ప్రీత్ సేన ప్రతి మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శననే నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. ఇక అన్ని జట్లను దాటడం ఒక్క ఎత్తయితే ఆస్ట్రేలియా పోరు మరో ఎత్తు. ఆ జట్టును దాటడమే అతి పెద్ద సవాల్. 2005 వరల్డ్ కప్, 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆసిస్ చేతులోనే భంగపాటు ఎదుర్కోంది. అంతేకాకుండా, ఆస్ట్రేలియా ప్రస్తుత చాంపియన్ కూడా. ఇటీవల వన్డే సిరీస్‌‌లో ఆస్ట్రేలియాకు బిగ్గెస్ట్ ఓటమిని రుచిచూపించింది హర్మన్‌ప్రీత సేన. ఆ విజయం భారత జట్టులో దీమా పెంచేదే.

Next Story