Asia Cup : సూర్య.. ప్రకాశిస్తాడా?.. కెప్టెన్‌గా, సారథిగా సత్తాచాటాల్సిందే

by Harish |

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ కఠిన పరీక్షను ఎదుర్కోబోతున్నాడు.

Asia Cup : సూర్య.. ప్రకాశిస్తాడా?.. కెప్టెన్‌గా, సారథిగా సత్తాచాటాల్సిందే
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ కఠిన పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. ఆసియా కప్‌లో భారత జట్టును విజేతగా నిలపడం అతని ముందు ఇప్పుడున్న సవాల్. టీ20 కెప్టెన్‌గా అతన్ని తప్పిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆసియా కప్ అతనికి చాలా కీలకం కానుంది. ప్రస్తుతం టెస్టుల్లో గిల్, వన్డేల్లో రోహిత్, టీ20ల్లో సూర్య కెప్టెన్లుగా ఉన్నారు. ఇటీవల టెస్టు పగ్గాలు అందుకున్న శుభ్‌మన్ గి‌ల్‌కు ఇంగ్లాండ్‌ టూరులో సారథిగా మంచి మార్కులే పడ్డాయి. దీంతో అతన్ని భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆసియా కప్‌కు వైస్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించడం అందులో భాగమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా కప్ గెలిస్తే సూర్యకుమార్‌ను తప్పించడం అంత సులభం కాదు. కాబట్టి, ఆసియా కప్‌లో సూర్య సారథిగా, ప్లేయర్‌గా తనదైన ముద్ర వేయాల్సిందే. అప్పుడే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు కెప్టెన్‌‌గా కొనసాగే అవకాశాలు ఉంటాయి.

కెప్టెన్‌గా ముద్ర

గతేడాది టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం రోహిత్ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ స్థానంలో సూర్య‌ టీ20 పగ్గాలు చేపట్టాడు. పొట్టి ప్రపంచకప్‌కు ముందు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 జట్టును నడిపించాడు. అతన్ని పక్కనపెట్టి మరి సూర్యకు బాధ్యతలు ఇచ్చారు. అప్పటి నుంచి కెప్టెన్‌‌గా సూర్య తనదైన ముద్రవేశాడు. జట్టును అద్భుతంగానే నడిపిస్తున్నాడు. అందులో ఎలాంటి సందేహాలు లేవు. శ్రీలంకతో టీ20 సిరీస్‌ కెప్టెన్‌గా సూర్యకు తొలి సిరీస్. తొలి సిరీస్‌లోనే సారథిగా ఆకట్టుకున్నాడు. సూర్య నేతృత్వంలో భారత జట్టు 3-0తో సిరీస్‌‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఆ తర్వాత కూడా సూర్య జట్టు వరుస విజయాలతో దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌‌పై 3-0తో సిరీస్ విజయం సాధించడంతోపాటు సౌతాఫ్రికాపై 3-1తో, ఇంగ్లాండ్‌పై 4-1తో సిరీస్‌లు గెలుచుకుంది. కెప్టెన్‌‌గా సూర్య విన్నింగ్ పర్సంటేజ్ 78.26. అతని నాయకత్వంలో భారత జట్టు 22 మ్యాచ్‌లు ఆడితే 18 విజయాలు నమోదు చేసింది. కేవలం నాలుగింట మాత్రమే ఓడింది. ఇంతటి ఘనమైన రికార్డు కలిగిన కెప్టెన్‌పై వేటు వేయడం అంత ఈజీగా ఉండకపోవచ్చు.

ఆ కారణంతోనే..

టీ20 కెప్టెన్‌గా సూర్యకు మంచి రికార్డే ఉన్నప్పటికీ కెప్టెన్ అయ్యాక ప్లేయర్‌గా మాత్రం ఆకట్టుకోలేదు. 15 మ్యాచ్‌ల్లో 258 రన్సే చేశాడు. సగటు 18.42గా ఉండటం ఆందోళన కలిగించే విషయం. అది సూర్యకు ప్రతికూలంశంగా మారొచ్చు. మరోవైపు, టీ20లకు, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేలలో మాత్రం కొనసాగుతున్న రోహిత్ శర్మ ఎంతో కాలం అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేడనేది వాస్తవం. కాబట్టి, అతను ఎప్పుడైనా రిటైర్మెంట్ ఇవ్వొచ్చు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీసే చివరిదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అతను తప్పుకున్న వెంటనే గిల్‌కు వన్డే పగ్గాలు దక్కొచ్చు. ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ అన్న కారణం చూపి సూర్యపై కూడా వేటు వేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆసియా కప్‌లో సూర్య కెప్టెన్‌గా, ప్లేయర్‌గా నిరూపించుకుంటే అతన్ని తప్పించడం అంత తేలికగా ఉండదని కూడా చెబుతున్నారు.

Next Story