Wimbledon 2025 : ఆసక్తికరంగా మొదలైన వింబుల్డన్.. తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టిన మెద్వెదెవ్

by Harish |

టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ ఆసక్తికరంగా మొదలైంది.

Wimbledon 2025 : ఆసక్తికరంగా మొదలైన వింబుల్డన్.. తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టిన మెద్వెదెవ్
X

దిశ, స్పోర్ట్స్ : టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్ ఆసక్తికరంగా మొదలైంది. మాజీ యూఎస్ ఓపెన్ చాంపియన్, వరల్డ్ నం.9 ప్లేయర్ మెద్వెదెవ్(రష్యా) తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. అతనికి ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోన్జీ షాకిచ్చాడు. సోమవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్‌పై 7-6(7-2), 3-6, 7-6(7-3), 6-2 తేడాతో బోన్జీ విజయం సాధించాడు. నాలుగు సెట్లలో రెండు సెట్ల ఫలితాలు టై బ్రేకర్‌లోనే తేలాయి. మెద్వెదెవ్ 12 డబుల్ ఫౌల్ట్స్, 47 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

వరల్డ్ నం.8 ప్లేయర్ రూనె(డెన్మార్క్) 6-4, 6-4, 5-7,3-6, 4-6 తేడాతో చిలీ ఆటగాడు నికోలస్ జర్రీ చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. తొలి రెండు సెట్లు నెగ్గిన తర్వాత రూనె పట్టు కోల్పోవడం గమనార్హం. ఇక, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ టైటిల్ వేటలో శుభారంభం చేశాడు. అయితే, ఈ సారి అతని ప్రయాణం అంత తేలికగా ఉండదని తొలి రౌండ్‌తోనే అర్థమై ఉంటుంది. తొలి రౌండ్ దాటడానికి అతను తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగ్నిని అతనికి గట్టిపోటీనిచ్చాడు. కానీ, అల్కరాజ్ తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ 7-5, 6-7(5-7), 7-5, 2-6, 6-1 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.1 సబలెంక కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఆమె అలవోకగా గెలిచింది. కెనడా క్రీడాకారిణి కార్సన్ బ్రాన్‌స్టైన్‌పై 6-1, 7-5 తేడాతో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది.


Next Story