రెండో టెస్టు బుమ్రా ఆడతాడా?లేదా?.. డైలమాలో గంభీర్, గిల్

by Harish |

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే.

రెండో టెస్టు బుమ్రా ఆడతాడా?లేదా?.. డైలమాలో గంభీర్, గిల్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. గిల్ సేన బాగానే ఆడినప్పటికీ కీలక సమయాల్లో పట్టు వదలడంతో దెబ్బకొట్టింది. రెండో టెస్టులో పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. వచ్చే నెల 2 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి సిరీస్‌లో పుంజుకుని 1-1తో సమం చేయాలని చూస్తోంది. అయితే, స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా రెండో టెస్టు ఆడతాడా?లేదా? అన్నది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దానికి కారణం లేకపోలేదు. బుమ్రా పనిభారం నిర్వహణలో భాగంగా ఈ సిరీస్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని మూడు టెస్టులకే పరిమితం చేసింది. ఇంగ్లాండ్ టూరుకు జట్టును ప్రకటించినప్పుడే బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గంభీర్ తెలిపారు. తొలి టెస్టు అనంతరం కూడా గంభీర్ అదే మాటకు కట్టుబడి ఉన్నాడు. అయితే, మిగతా నాలుగు టెస్టుల్లో ఏ రెండు మ్యాచ్‌లు ఆడతాడో తెలియదని చెప్పాడు. దీంతో రెండో టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడా?లేదా?అన్నది టీమ్ మేనేజ్‌మెంటే క్లారిటీ ఇవ్వాలి.

బుమ్రా ఆడకపోతే దెబ్బే

లీడ్స్ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీయలేకపోయినా పొదుపుగానే బౌలింగ్ చేశాడు. రెండో టెస్టుకు బుమ్రా దూరమైతే భారత్ భారీ లోటే. మిగతా పేసర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తొలి టెస్టులో భారీగా సమర్పించుకున్నారు. బుమ్రా 43.4 ఓవర్లలో 5 వికెట్లు తీసి 140 పరుగులు ఇవ్వగా.. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కలిసి 92 ఓవర్లు వేసి 9 వికెట్లు తీసి 482 పరుగులు ఇచ్చారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే బుమ్రా ఎంత పొదుపుగా బౌలింగ్ చేశాడో అర్థమవుతుంది. భారత బౌలింగ్ దళానికి బుమ్రానే బలం. అతనే దూరమైతే బౌలింగ్ యూనిట్ బలహీనమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బుమ్రాను ఐదు టెస్టులు ఆడించాలని మాజీ క్రికెట్ సునీల్ గవాస్కర్ సూచించాడు.

అర్ష్‌దీప్ లేదా ఆకాశ్ దీప్

ఒకవేళ బుమ్రాకు రెండో టెస్టులో విశ్రాంతి ఇస్తే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. బెంచ్‌పై యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ ఉన్నారు. అలాగే, ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది. అయితే, పోటీ మాత్రం అర్ష్‌దీప్, ఆకాశ్ దీప్ మధ్యే. అర్ష్‌దీప్ ఇంతకుముందు టెస్టులు ఆడలేదు. కానీ, వన్డే, టీ20ల్లో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో బెస్ట్ బౌలర్‌గా గుర్తింపుపొందాడు. మరోవైపు, ఆకాశ్ దీప్‌కు టెస్టులు ఆడిన అనుభవం ఉంది. 7 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు. అలాగే, గతేడాది భారత్‌లో ఇంగ్లాండ్‌తో ఆడిన ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. అప్పుడు 8 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరి, వీరిద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.

బుమ్రాను ఆడించండి : రవిశాస్త్రి

రెండో టెస్టులో బుమ్రాను ఆడించాలని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. ఎందుకో కారణం కూడా చెప్పాడు. అతన్ని ఆడించకపోతే ఒకవేళ రెండో టెస్టులో భారత్ ఓడితే సిరీస్‌లో 2-0తో వెనుకబడుతుందన్నాడు. ‘రెండో టెస్టు కోసం బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడనుకుంటున్నా. ఎందుకంటే అతను లార్డ్స్ స్టేడియంలో జరిగే మూడో టెస్టును కచ్చితంగా ఆడాలనుకుంటాడు. కానీ, 2-0తో వెనుకబడితే మాత్రం సమస్య అవుతుంది. రెండో టెస్టులో అతను ఆడాలనేది నా అభిప్రాయం.’అని శాస్త్రి తెలిపాడు.

Next Story