రిటైర్మెంట్‌పై షమీ కీలక వ్యాఖ్యలు.. అప్పుడే రిటైర్ అవుతానని కామెంట్

by Harish |   (  Updated:2025-08-28 13:40:49  IST  )

భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ తనపై వస్తున్న రిటైర్మెంట్ రూమర్లను కొట్టిపారేశాడు.

రిటైర్మెంట్‌పై షమీ కీలక వ్యాఖ్యలు.. అప్పుడే రిటైర్ అవుతానని కామెంట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ తనపై వస్తున్న రిటైర్మెంట్ రూమర్లను కొట్టిపారేశాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ మాట్లాడుతూ.. తనకు ఆటపై బోర్ కొట్టినప్పుడే రిటైర్ అవుతానని స్పష్టం చేశాడు. జాతీయ జట్టులో చోటు దక్కినా దక్కకపోయినా కాంపిటేటివ్ క్రికెట్‌లో కొనసాగుతానని తెలిపాడు.‘నేను ఆడటం ఎవరికైనా సమస్యగా ఉందా?. నేను రిటైర్ అయితే వారి జీవితాలు బాగు పడతాయా?. చెప్పండి. ఏ రోజైతే నాకు ఆటపై బోర్ కొడుతుందో ఆ రోజు తప్పుకుంటా. నేను సెలెక్ట్ కాకపోయినా కష్టపడుతూనే ఉంటా. అంతర్జాతీయ క్రికెట్‌కు నన్ను ఎంపిక చేయకపోతే దేశవాళీ ఆడతా. ఎక్కడో ఒక్క చోట ఆడుతూనే ఉంటా. మీకు విసుగు వస్తేనే రిటైర్మెంట్ నిర్ణయాలు వస్తాయి. కానీ, ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు.’అని షమీ తెలిపాడు.

అలాగే, గత రెండేళ్లుగా రావాల్సిన అవకాశాలు రాకపోవడంపై షమీ స్పందిస్తూ.. తాను ఎవరిని నిందించనని, ఎవరిపై ఫిర్యాదు చేయనని చెప్పాడు. ‘మీ ప్రణాళికల్లో నేను ఉంటే నన్ను ఎంపిక చేయలేదు. లేదంటే ఎంపిక చేయొద్దు. నాకు ఎలాంటి అభ్యంతర లేదు. చాన్స్ ఇస్తే మాత్రం దేశం కోసం నా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉంటా.’అని చెప్పుకొచ్చాడు. అలాగే, 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడాలనే కోరికన షమీ వ్యక్తం చేశాడు. ‘వన్డే ప్రపంచకప్ గెలవాలనే కోరిక మిగిలి ఉంది. ప్రపంచకప్ జట్టులో నేను భాగమై వరల్డ్ కప్‌ను దేశానికి తీసుకురావాలి.’అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. కాగా, షమీ చివరిసారిగా భారత్ తరపున మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌తోపాటు త్వరలో ప్రారంభమయ్యే ఆసియా కప్‌కు అతన్ని ఎంపిక చేయలేదు.


Next Story