తొలి టెస్టులో టీమిండియా ఓటమి.. తప్పు ఎక్కడ జరిగింది?.. ఆ మూడు కారణాలే దెబ్బేశాయి

by Harish |

ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఆసక్తికరంగా సాగిన తొలి టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

తొలి టెస్టులో టీమిండియా ఓటమి.. తప్పు ఎక్కడ జరిగింది?.. ఆ మూడు కారణాలే దెబ్బేశాయి
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఆసక్తికరంగా సాగిన తొలి టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, తొలి టెస్టులో టీమిండియా బాగా ఆడలేదా? అంటే బాగానే ఆడింది. ఐదు రోజుల ఆటలో మూడు రోజులు ఆధిపత్యం ప్రదర్శించింది. టీమిండియా తరపున ఐదు శతకాలు నమోదయ్యాయి. కానీ, ఒక్క తప్పిదం మ్యాచ్‌నే మలుపు తిప్పుతుంది. అలాంటిది భారత్ కీలక సమయాల్లో పట్టు వదలడం, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకపోవడం, పేలవ ఫీల్డింగ్‌తో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ టెస్టు మ్యాచ్‌లో ఐదు శతకాలు నమోదు చేసిన జట్టు ఓటమిపాలవడం ఇదే తొలిసారి. మరి, రెండో టెస్టులోనైనా భారత్ లోపాలను సరిదిద్దుకుంటుందో లేదో చూడాలి.

మిడిల్, లోయర్ ఆర్డర్ వైఫల్యం

భారత్ ఓటమికి మిడిల్, లోయర్ ఆర్డర్‌ బ్యాటర్లు విఫలమవడం ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత మిడిల్, లోయర్ ఆర్డర్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదుగురు చేసిన పరుగులు 65 మాత్రమే. మిడిలార్డర్‌లో పంత్ మినహా ఎవరూ రాణించలేదు. కరుణ్ నాయర్, జడేజా, శార్దూల్ ఠాకూర్ దారుణంగా విఫలమవ్వగా.. టెయిలెండర్లు బుమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్ ఏం చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో గిల్(147), జైశ్వాల్(101), పంత్(134) సెంచరీలతో కదం తొక్కడంతో భారత్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఒక దశలో 430/3 స్కోరుతో నిలిచిన భారత్ 600లకు దగ్గరగా వెళ్తుందనిపించింది. కానీ, అనూహ్యంగా తడబాటుకు గురైంది. కేవలం 41 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. దీంతో 471 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లోనైనా వారి ఆట మారుతుందనకుంటే అదీ లేదు. మళ్లీ అదే తీరు. జైశ్వాల్(4), సాయి సుదర్శన్(30), గిల్(8) నిరాశపర్చడంతో ఆరంభంలో టీమిండియా తడబడినా.. కేఎల్ రాహుల్(137), పంత్(118) సత్తాచాటి జట్టును ఆదుకున్నారు. 333/4తో భారత్ మంచి స్థితిలోనే ఉంది. అయితే, మరోసారి మిడిల్, లోయర్ ఆర్డర్ చేతులెత్తేసింది. దీంతో 31 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి 364 పరుగులకే ఆలౌటైంది. మిడిల్, లోయర్ ఆర్డర్‌లో మరో 50 పరుగుల వచ్చినా భారత్ కనీసం డ్రా అయినా చేసుకునేది.

చెత్త ఫీల్డింగ్

పేలవ ఫీల్డింగ్ కూడా టీమిండియా పరాజయానికి మరో కారణం. తొలి టెస్టులో భారత ఆటగాళ్లు ఏకంగా ఏడెనిమిది క్యాచ్‌లు నేలపాలు చేశారు. జైశ్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్‌లను మిస్ చేశాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో డక్కెట్, బ్రూక్ రెండుసార్లు క్యాచ్ అవుట్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 62 రన్స్ చేసిన డక్కెట్ 15 పరుగుల వద్దే అవుటయ్యేవాడు. అతను ఇచ్చిన క్యాచ్‌‌లను జైశ్వాల్ అందుకోలేకపోయాడు. కాసేపటికే జడేజా అతనికి మరో లైఫ్ ఇచ్చాడు. బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌లను ఓ సారి పంత్, మరోసారి జైశ్వాల్ మిస్ చేశారు. లైఫ్ లైన్ పొందిన అతను 99 రన్స్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, సెంచరీ బాదిన ఓలీ పోప్ కూడా 60 పరుగుల వద్దే పెవిలియన్ చేరేవాడు. బుమ్రా బౌలింగ్‌‌లో జైశ్వాల్ క్యాచ్ నేలపాలు చేశాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించే అవకాశాలను భారత చేజార్చుకుంది. ఆ ముగ్గురు అవుటై ఉంటే ఇంగ్లాండ్ ఒత్తిడికి గురై మోస్తరు స్కోరుకే పరిమితమయ్యేది. ఓలీ పోప్, బ్రూక్, డక్కెట్ సత్తాచాటడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో దీటుగా బదులిచ్చి 465 పరుగులు చేసింది. ఇక, చివరి రోజు కూడా కీలకమైన డక్కెట్ క్యాచ్‌ను జైశ్వాల్ నేలపాలు చేశాడు. క్యాచ్ అవుట్ నుంచి బయటపడిన డక్కెట్ భారీ సెంచరీతో కదం తొక్కి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నాడు.

ఐదో రోజు ఆకట్టుకోని బౌలర్లు

371 పరుగుల లక్ష్యం చిన్నదేం కాదు. భారత బౌలర్లు కాపాడుకునే టార్గెటే. కానీ, ఐదు రోజు భారత బౌలర్లు ఆకట్టుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇతర బౌలర్ల నుంచి కూడా పెద్దగా సహకారం అందలేదు. దీంతో ఇంగ్లాండ్‌కు ఛేదన పెద్ద కష్టమేమీ కాలేదు. కానీ, ఒక దశలో ఇంగ్లాండ్‌ను కట్టడి చేసే అవకాశం భారత్‌కు దక్కింది. డక్కెట్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందించిన జాక్ క్రాలీని ప్రసిద్ధ్ అవుట్ చేసి ఆ జోడీని విడదీశాడు. కాసేపటికే ఓలీ పోప్‌‌‌ను పెవిలియన్ పంపాడు. మరికాసేపటికే ప్రమాదకరమైన డక్కెట్, బ్రూక్‌లను శార్దూల్ ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు. స్వల్ప వ్యవధిలోనే ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోవడంతో భారత్ పోటీలోకి వచ్చినట్టు కనిపించింది. ఆ అద్భుతమైన అవకాశాన్ని టీమిండియా అందిపుచ్చుకుంటే ఫలితం మరోలా ఉండేది. కానీ, భారత బౌలర్లు పట్టు విడిచారు. ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచకపోవడంతో ఓటమి తప్పలేదు.


Next Story