పాక్‌కు షాకిచ్చిన వెస్టిండీస్.. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించిన హోల్డర్

by Harish |

తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్‌పై వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది.

పాక్‌కు షాకిచ్చిన వెస్టిండీస్.. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించిన హోల్డర్
X

దిశ, స్పోర్ట్స్ : తొలి టీ20లో ఓటమికి పాకిస్తాన్‌పై వెస్టిండీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఫ్లోరిడాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో విండీస్ 2 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. హోల్డర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా అతను బంతితో విజృంభించాడు. హోల్డర్ 4 వికెట్లతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 133/9 స్కోరే చేసింది. పాక్ జట్టులో హసన్ నవాజ్(40), సల్మాన్ అఘా(38) పర్వాలేదనిపించారు. మిగతా వారిలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం 134 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించడానికి కరేబియన్ జట్టు తీవ్రంగా కష్టపడింది. ఆ జట్టులో గుడాకేశ్ మోటీ(28)నే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. అయితే, మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు జోడించారు. అయితే, 18 బంతుల్లో 36 రన్స్ చేయాల్సిన దశలో మ్యాచ్ పాక్ చేతుల్లోనే ఉంది. కానీ షెఫర్డ్(15)‌తో కలిసి హోల్డర్ (16 నాటౌట్) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 18, 19 ఓవర్లలో 28 రన్స్ రాబట్టి విండీస్‌ను విజయానికి చేరువ చేశాడు. ఇక, చివరి బంతికి రెండు రన్స్ కావాల్సి ఉండగా హోల్డర్ ఫోర్ కొట్టడంతో విండీస్ విజయం లాంఛనమైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక, మూడో టీ20లోనే సిరీస్ ఫలితం తేలనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సోమవారం జరగనుంది.


Next Story