50 ఓవర్లూ స్పిన్నర్లే..క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం!

by Phanindra |

వన్డే క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం 50 ఓవర్లూ స్పిన్నర్లే వేశారు. వెస్టిండీస్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఈ వింత జరిగింది.

50 ఓవర్లూ స్పిన్నర్లే..క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం!
X

దిశ, స్పోర్ట్స్: వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పేసర్ల చేత ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. కేవలం స్పిన్నర్లతోనే 50 ఓవర్లూ వేయించింది. ఈ ప్లాన్ ఫలించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులే చేయగలిగింది. ఛేజింగ్‌లో తడబడిన విండీస్ జట్టు కూడా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులే చేయగలిగింది. దీంతో మ్యాచ్ సూప్ ఓవర్‌కు వెళ్లింది. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఇలా టై అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సూపర్ ఓవర్లో విండీస్ కేవలం 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా ఛేజింగ్‌లో విండీస్ స్పిన్నర్ అకీల్ హొస్సేన్ వైడ్స్, నోబాల్స్ వేసినా.. లీగల్ డెలివరీల్లో పరుగులు కట్టడి చేశాడు. దీంతో 9/1 స్కోరు మాత్రమే చేసిన బంగ్లా.. ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను విండీస్ 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే గురువారం నాడు జరగనుంది.

క్రికెట్ చరిత్రలో తొలిసారి

విండీస్ టీంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్‌కు మాత్రమే పేసర్‌గా చోటు దక్కింది. అయితే అతనికి బౌలింగ్ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. ఆ టీం బౌలర్లలో అలిక్ అథనాజే పది ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. మరో స్పిన్నర్ గుడకేష్ మోతీ మూడు వికెట్లతో రాణించాడు. ఇదే మైదానంలో ఆడిన తొలి వన్డేలో బంగ్లా స్పి్న్నర్ రిషద్ హొస్సేన్ ఆరువికెట్లతో రాణించిన నేపథ్యంలోనే విండీస్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఇలా ఓవర్లన్నీ స్పిన్నర్లే వేయడం ఎన్నడూ జరగలేదు. గతంలో అత్యధిక ఓవర్లు స్పిన్ వేసిన జట్టుగా శ్రీలంక ఉండేది. ఆ జట్టు 1996లో వెస్టిండీస్‌పై, 1998లో న్యూజిల్యాండ్‌పై, 2004లో ఆస్ట్రేలియాపై 44 ఓవర్ల స్పిన్ వేసి ఆశ్చర్యపరించింది. 1995లో కూడా విండీస్‌పై 43 ఓవర్లు స్పిన్ వేసింది. ఇప్పుడు విండీస్ పూర్తి 50 ఓవర్ల స్పిన్‌తో ఆ రికార్డును తిరగరాసింది.

Next Story