వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ ర్యాంక్‌లను తొలగించిన ఐసీసీ.. అసలేం జరిగిందంటే?

by Harish |

ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాలు అదృశ్యమయ్యాయి.

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ ర్యాంక్‌లను తొలగించిన ఐసీసీ.. అసలేం జరిగిందంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాలు అదృశ్యమయ్యాయి. ఐసీసీ వారి ర్యాంక్‌లను తొలగించింది. గత వారంలో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్, కోహ్లీ స్థానాలు ఉన్నాయి. రోహిత్ 756 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా.. కోహ్లీ 736 రేటింగ్ పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో మాత్రం వారి స్థానాలు గల్లంతవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా.. పాక్ బ్యాటర్ బాబర్ ఆజామ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 6వ స్థానంలో ఉన్నాడు.

ఐసీసీ రూల్ ప్రకారం.. ఆటగాడు నిర్ణీత వ్యవధిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే టాప్-100 ర్యాంకింగ్స్‌‌ నుంచి తప్పిస్తారు. టెస్టుల్లో ఈ గడువు 12-15 నెలలు. వన్డే, టీ20ల్లో 9-12 నెలలు. ఒక ఆటగాడు ఏదైనా ఫార్మాట్ నుంచి రిటైర్ అయితే లేదా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే ర్యాంకింగ్స్ నుంచి శాశ్వతంగా తొలగించారు. రోహిత్, కోహ్లీలు ఇప్పటికే టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వారిని టెస్టు, టీ20 ర్యాంకింగ్స్ నుంచి తొలగించారు. కానీ, వారిద్దరూ వన్డేలలో కొనసాగుతున్నన్నారు. వారు చివరిసారిగా మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను న్యూజిలాండ్‌తో ఆడారు. ఆ తర్వాత వారు భారత్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. దాదాపు ఐదు నెలలు అవుతుంది. ఐసీసీ రూల్ ప్రకారం 9-12 నెలల గడువును కూడా అతిక్రమించలేదు. అలాంటప్పుడు తాజా ర్యాంకింగ్స్‌లో వారి స్థానాలు తొలగించడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వర్గాలు స్పందించాయి. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని తెలిపాయి.

నం.1 బౌలర్‌గా మహరాజ్

సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వన్డేల్లో నం.1 బౌలర్‌గా అవతరించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 687 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియా‌తో జరిగిన తొలి వన్డేలో మహరాజ్ ఐదు వికెట్లతో చెలరేగి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనే కారణంగానే అతను రెండు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్ పొందాడు. గత ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక బౌలర్ మహేశ్ తీక్షణ రెండో స్థానానికి పడిపోయాడు. భారత స్పిన్నర్ కుల్దీప యాదవ్ 3వ స్థానంలో ఉన్నాడు. షమీ, బుమ్రా, సిరాజ్ చెరో స్థానం మెరుగుపర్చుకుని వరుసగా 13, 14, 15 ర్యాంక్‌లలో నిలిచారు. వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ జడేజా ఒక్క స్థానం మెరుగుపర్చుకుని టాప్-10లో నిలిచాడు.


Next Story