రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ కింగే.. ఎవరూ సాధించని రికార్డు సృష్టించిన విరాట్

by Harish |

గతేడాది టీ20లకు, ఇటీవల టెస్టులకు విరాట్ రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ కింగే.. ఎవరూ సాధించని రికార్డు సృష్టించిన విరాట్
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో రికార్డులు అంటే గుర్తొచ్చేది విరాట్ కోహ్లీనే. మైదానంలో అతను సాధించిన ఘనతలు ఎన్నో. గతేడాది టీ20లకు, ఇటీవల టెస్టులకు విరాట్ రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ ఆటగాడూ సాధించని ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ పురుషుల ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో 900 రేటింగ్ పాయింట్స్ సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 2018లో కోహ్లీ టెస్టుల్లో 937 రేటింగ్ పాయింట్స్, అదే ఏడాది వన్డేల్లో 909 రేటింగ్ పాయింట్స్‌ సాధించాడు. తాజాగా టీ20ల్లోనూ 900ల మార్క్‌ను అందుకున్నాడు. ఐసీసీ బుధవారం కోహ్లీ గరిష్ట టీ20 రేటింగ్ పాయింట్స్‌ను అప్‌డేట్ చేసింది. దీంతో అతని రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కు చేరింది. దీంతో కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ 900 రేటింగ్ పాయింట్స్ సాధించిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతానికి టీ20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీది మూడో హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్స్. అతని కంటే ముందు డేవిడ్ మలన్(919), సూర్యకుమార్(912) ఉన్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కోహ్లీ కింగే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన అతను ఇక వన్డేల్లో మాత్రం ఆడనున్నాడు.


Next Story