తీవ్ర నిరాశ.. ఆసియా గేమ్స్ నుంచి వినేశ్ ఫోగట్ అవుట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-30 12:10:40  IST  )

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్.. ఆసియా గేమ్స్ లో సత్తా చాటుతుందన్న ఆశలన్నీ నిరాశలయ్యాయి.

తీవ్ర నిరాశ.. ఆసియా గేమ్స్ నుంచి వినేశ్ ఫోగట్ అవుట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్.. ఆసియా గేమ్స్ లో సత్తా చాటుతుందన్న ఆశలన్నీ నిరాశలయ్యాయి. శనివారం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 53 కేజీల విభాగం సెమీఫైనల్స్ లో 31 ఏళ్ల వినేశ్ ఫోగట్.. మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026)కు అర్హత సాధించడంలో ఆమె ఫెయిలైంది. రోజంతా తీవ్ర వివాదాలు, ఉత్కంఠల మధ్య సాగిన ట్రయల్స్ లో.. వినేశ్ సెమీస్ ను జయించలేకపోయింది. అంతకుముందు జరిగిన మ్యాచుల్లో వినేశ్ జ్యోతిపై 7-1 తేడాతో గెలిచింది. క్వార్టర్ ఫైనల్ లో హర్యానాకు చెందిన నిఘ గట్టి పోటీ ఇచ్చింది. మొదటి పీరియడ్‌లోనే నిషు 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి, వినేశ్ ను దాదాపు పిన్ చేసినంత పనిచేసింది. కానీ వినేశ్ ఎలాగోలా ఆమె పట్టు నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత టెక్నికల్ ఛాలెంజ్‌లు, రివ్యూ స్క్రీన్లు మొరాయించడంతో మ్యాచ్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. డబ్ల్యూఎఫ్ఐ (WFI) అధికారులకు, కోచ్‌లకు మధ్య పెద్ద వివాదమే నడిచింది.

అయితే.. ఈ ఆలస్యం వినేశ్ కు కలిసివచ్చింది. ఒక దశలో స్కోరు 6-6 గా ఉన్నప్పుడు నిషు టేక్‌డౌన్ ప్రయత్నం చేసినా రిఫరీ పాయింట్లు ఇవ్వలేదు. నిషు కోచ్ చేసిన ఛాలెంజ్ కూడా విఫలమవడంతో విజయం వినేశ్ సొంతమయింది. ఓటమిని తట్టుకోలేక నిషు కన్నీళ్లు పెట్టుకుంటూ రిఫరీతో, వినేశ్ తో కరచాలనం చేయడానికి నిరాకరించింది.

బరువు విభాగంపై హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే?

నిజానికి శనివారం ఉదయం వినేశ్ ట్రయల్స్‌లో పాల్గొనడమే ఒక పెద్ద సంచలనంగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌తో సహా గత నాలుగు అంతర్జాతీయ ఈవెంట్లలో వినేష్ 50 కేజీల విభాగంలోనే పోటీ పడినందున, ఆమెను కేవలం 50 కేజీల విభాగంలోనే ఆడాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మొదట స్పష్టం చేసింది. దీనిపై వినేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డబ్ల్యూఎఫ్ఐ తనపై వివక్ష చూపిస్తోందని, నచ్చిన కేటగిరీలో ఆడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆ తర్వాత వినేశ్ బరువు 53.9 కేజీలుగా తేలడంతో ఆమెను 53 కేజీల విభాగంలో చేర్చారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా వినేశ్ ఫోగట్‌ను ‘ఐకానిక్ ప్లేయర్’గా పరిగణించాలని, ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు అనుమతి ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు, తీవ్ర వివాదాల నడుమ బరిలోకి దిగిన వినేశ్.. సెమీఫైనల్లో ఓడిపోవడంతో క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Next Story