చరిత్ర సృష్టించిన వైస్ కెప్టెన్ స్మృతి మంధాన

by Malleboina Mahesh |

భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.

చరిత్ర సృష్టించిన వైస్ కెప్టెన్ స్మృతి మంధాన
X

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ రోజు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారతీయ క్రీడాకారిణిగా, ఓవరాల్‌గా ప్రపంచంలోనే నాలుగో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. ఈ మ్యాచ్‌కు ముందు 9,973 పరుగులతో ఉన్న ఆమె, కేవలం 20 బంతుల్లోనే అవసరమైన 27 పరుగులు చేసి ఈ మైలురాయిని అధిగమించారు.

అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే (281 ఇన్నింగ్స్‌లు) ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా స్మృతి మంధాన ప్రపంచ రికార్డు సృష్టించారు. గతంలో భారత దిగ్గజం మిథాలీ రాజ్ 291 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరగా, స్మృతి దానిని 10 ఇన్నింగ్స్‌లు ముందుగానే పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ రాజ్ (10,868), సూజీ బేట్స్ (10,652), షార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273) మాత్రమే స్మృతి కంటే ముందున్నారు. అదేవిధంగా, శ్రీలంకతో జరిగిన ఈ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లోనే టీ20ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా కూడా స్మృతి మంధాన రికార్డు సృష్టించారు.

Next Story