వరుణ్ చక్రవర్తికి భారీ షాక్.. టీ20ల్లో అగ్రస్థానం గల్లంతు

by Harish |

వరుణ్ చక్రవర్తికి భారీ షాక్.. టీ20ల్లో అగ్రస్థానం గల్లంతు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో అంచనాలు అందుకోలేకపోయిన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి మరో షాక్ తగిలింది. టీ20ల్లో నం.1 బౌలర్‌గా ఉన్న అతను తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోల్పోయాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో వరుణ్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభంలో బాగానే రాణించిన అతను ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో సెమీస్, న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో భారీగా రన్స్ సమర్పించుకున్నాడు. దీంతో దాదాపు 68 పాయింట్స్ కోల్పోయిన అతను టాప్ ర్యాంక్‌ నుంచి పడిపోయాడు. దీంతో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. రషీద్ కంటే వరుణ్ 13 పాయింట్స్ వెనుకబడి ఉన్నాడు. మరోవైపు, స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఒక్క స్థానం మెరుగుపర్చుకుని 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ వరుసగా 16, 17 ర్యాంక్‌ల్లో ఉన్నారు.

టాప్-2 బ్యాటర్లు మనోళ్లే

టీ20ల్లో నం.1, నం.2 బ్యాటర్లు మనోళ్లే ఉన్నారు. అభిషేక్ శర్మ(875 పాయింట్స్) నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఇషాన్ కిషన్(871 పాయింట్స్) రెండు స్థానాలను ఎగబాకి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇద్ధరి మధ్య కేవలం 4 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. అలాగే, టీ20 ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసిన సంజూ శాంసన్ తన ర్యాంక్‌ను భారీగా మెరుగుపర్చుకున్నాడు. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. శివమ్ దూబె నాలుగు స్థానాలు వెనక్కినెట్టి 27వ స్థానంలో నిలిచాడు. తెలుగు కుర్రాడు తిలక్ శర్మ ఒక్క స్థానం కోల్పోయి 7వ ర్యాంక్‌కు పడిపోవడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ 321 రన్స్‌తో భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఇషాన్ కిషన్ 317 రన్స్ చేశాడు.


Next Story