Badminton : యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?

by Harish |

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు.

Badminton : యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. టోర్నీ ఆరంభం నుంచి సత్తాచాటుతున్న అతను ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగిన సెమీస్‌లో శ్రీకాంత్.. జపాన్‌కు చెందిన యుడై ఒకిమోటోపై పోరాడి గెలిచాడు. మూడో గేములో ఫలితం తేలగా 22-20, 15-21, 21-19 తేడాతో ప్రత్యర్థిని ఓడించాడు. మ్యాచ్ గంటా 12 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగింది. ప్రత్యర్థి నుంచి శ్రీకాంత్ తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతను పట్టుదల కోల్పోలేదు. తన అనుభవాన్ని అంతా ప్రదర్శించి చివరికి పై చేయి సాధించాడు. మాజీ వరల్డ్ నం.1 అయిన శ్రీకాంత్ వ్యక్తిగత టైటిల్ గెలిచి ఏళ్లు అవుతుంది. 2017‌లో అతను చివరిసారిగా ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. అప్పటి నుంచి అతను మరో టైటిల్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు. గతేడాది మలేసియా మాస్టర్స్, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరినా నిరాశ తప్పలేదు. మరి, యూఎస్ ఓపెన్ టోర్నీలో శ్రీకాంత్ 9 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించుతాడా? చూడాలి. సోమవారం సు లీ యాంగ్(చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ తాడోపేడో తేల్చుకోనున్నాడు.

రౌనక్, దేవిక ఔట్

టోర్నీలో యువ ప్లేయర్లు రౌనక్ చౌహాన్, దేవిక సిహాగ్ సంచలన ప్రదర్శన ముగిసింది. సెమీస్‌లో వారు పరాజయం పాలై ఇంటిదారిపట్టారు. మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో చైనీస్ తైపీకి చెందిన సు లీ యాంగ్‌తో తలపడిన రౌనక్ 17-21, 19-21 తేడాతో పోరాడి ఓడిపోయాడు. ఇక, మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో దేవిక సంచలన పోరాటం వృథా అయ్యింది. డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫెర్సెన్ చేతిలో 21-15, 11-21, 15-21 తేడాతో ఓడిపోయింది. తొలి గేము నెగ్గినప్పటికీ మిగతా రెండు గేముల్లో ప్రత్యర్థిని నిలువరించలేకపోయింది.

Next Story