WPL 2025 : బెత్ మూనీ విధ్వంసం.. చెలరేగిన బౌలర్లు.. యూపీపై గుజరాత్ అలవోక విజయం

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

WPL 2025 : బెత్ మూనీ విధ్వంసం.. చెలరేగిన బౌలర్లు.. యూపీపై గుజరాత్ అలవోక విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 81 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. బెత్ మూనీ(96 నాటౌట్) విధ్వంసానికి తోడు బౌలర్లు కూడా రాణించడంతో గుజరాత్ అలవోకగా నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 రన్స్ చేసింది. బెత్ మూనీకితోడు హర్లీన్ డియోల్(46) కూడా సత్తాచాటింది. అనంతరం ఛేదనలో యూపీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. 17.1 ఓవర్లలో 105 పరుగులే చేసి కుప్పకూలింది. చినెల్లె హెన్రీ చేసిన 28 పరుగులే టాప్ స్కోర్. కాశ్వీ గౌతమ్(3/11), తనూజ(3/17) యూపీ పతనాన్ని శాసించి గుజరాత్ విజయాన్ని సునాయాసం చేశారు.తాజాగా విజయంతో గుజరాత్ నాకౌట్ ఆశలు మెరుగుపర్చుకోగా.. యూపీ నాకౌట్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.

యూపీ విలవిల

గుజరాత్ బౌలర్ల ధాటికి యూపీ విలవిలలాడిపోయింది. ముఖ్యంగా కాశ్వీ గౌతమ్ తనూజ, డెయాండ్రా డాటిన్ ఆ జట్టు పతనాన్ని శాసించారు. దీంతో యూపీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. చినెల్లె హెన్రీ(28), గ్రేస్ హ్యారిస్(25) పర్వాలేదనిపించగా.. మిగతా వారు క్రీజులో నిలువలేకపోయారు. కిరణ్(0), జార్జియా వాల్(0, సుల్తానా(0) డకౌటవ్వగా.. వ్రింద దినేశ్(1), కెప్టెన్ దీప్తి(6), శ్వేత సెహ్రావత్(5) సింగిల్ డిజి్‌కే పరిమితమయ్యారు. 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. చినెల్లె హెన్రీ‌కితోడు ఉమా చెత్రి(17), ఎక్లోస్టోన్(14) విలువైన రన్స్ జోడించడతో యూపీ కష్టంగా 100 రన్స్ దాటింది. 10వ వికెట్‌గా ఎక్లోస్టోన్ వికెట్ పారేసుకోవడంతో ఆ జట్టు ఆట 17.1 ఓవర్లలోనే ముగిసింది.

బెత్ మూనీ విధ్వంసం

అంతకుముందు గుజరాత్‌కు పేలవ ఆరంభమే దక్కింది. ఓపెనర్ హేమలత(2) తొలి ఓవర్‌లోనే వికెట్ పారేసుకుంది. కానీ, మరో ఓపెనర్ బెత్ మూనీ, క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. యూపీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరు బౌండరీలు బాదారు. దీంతో స్కోరు బోర్డు వేగం పెరిగింది. రెండో వికెట్‌కు ఈ జోడీ 101 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న హర్లీన్ డియోల్‌ను ఎక్లోస్టోన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ జోడీ విడిపోయింది. అనంతరం బెత్ మూనీ మరింత దూకుడు పెంచింది. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడింది. అయితే, మరో ఎండ్‌లో కెప్టెన్ గార్డ్‌నెర్(11), డెయాండ్రా డాటిన్(17), లిచ్‌ఫీల్డ్(8) క్రీజులో నిలువలేకపోయారు. అయినప్పటికీ బెత్ మూనీ చివరి వరకూ నిలవడంతో గుజరాత్ 186 పరుగులు చేసింది.

Next Story