ఆర్సీబీకి బిగ్ షాక్.. ఆ జట్టు ప్లేయర్‌పై ఒక్క మ్యాచ్ నిషేధం

by Harish |

ఆర్సీబీకి బిగ్ షాక్.. ఆ జట్టు ప్లేయర్‌పై ఒక్క మ్యాచ్ నిషేధం
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ టిమ్ డేవిడ్ ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అతను తొలి మ్యాచ్‌కు దూరంకానున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ అనుచితంగా ప్రవర్తించాడు. జీటీ ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్‌లో డేవిడ్ మైదానంలో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ వైపు కోపంతో ఐస్ బ్యాగ్‌ను విసిరాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. మ్యాచ్ జరుగుతుండగా ఆటగాడిపైగానీ, టీమ్ అఫీషియల్స్‌పైగానీ, అంపైర్, మ్యాచ్ రిఫరీలపైగానీ క్రికెట్ పరికరాలను ప్రమాదకరమైన రీతిలో విసరడం నేరం. ఈ రూల్‌ను డేవిడ్ ఉల్లంఘించడాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సీరియస్‌గా తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేయడంతోపాటు రెండు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చింది. లీగ్ దశలో ఇప్పటికే రెండుసార్లు నిబంధనలను ఉల్లంఘించడంతో అతనికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మూడు డీమెరిట్ పాయింట్స్ ఇచ్చింది. డేవిడ్ ఖాతాలో మొత్తం ఐదు డీమెరిట్ పాయింట్స్ చేరాయి. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఏ ప్లేయర్ ఖాతాలోనైనా 4 డీమెరిట్ పాయింట్స్ చేరితే సదరు ఆటగాడిపై ఓ మ్యాచ్ నిషేధం విధిస్తారు. దీంతో ఐపీఎల్-2027లో డేవిడ్ ఆర్సీబీకి ఆడిన లేదా ఇతర ఏ ఫ్రాంచైజీకి ఆడినా తొలి మ్యాచ్‌‌కు దూరంగా ఉంటాడు.


Next Story