కండరాలు విరిగిపోయాయి..నరాలు బిగుతుగా మారాయి.. ఆ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడిన తిలక్

by Harish |   (  Updated:2025-10-24 12:53:52  IST  )

టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ తన గురించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

కండరాలు విరిగిపోయాయి..నరాలు బిగుతుగా మారాయి.. ఆ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడిన తిలక్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ తన గురించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తాను ప్రాణాంతకమైన వ్యాధి‌తో పోరాడి ప్రాణాలతో బయటపడినట్టు తెలిపాడు. తాజాగా ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’ షోలో తిలక్ తన సమస్య గురించి వివరించాడు. 2022లో తన వ్యాధి గురించి తెలిసిందన్నాడు. ‘ఇంతకుముందు ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేదు. నా తొలి ఐపీఎల్ సీజన్ తర్వాత నేను ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నాను. నాకు రాబ్డోమయోలిసిస్ అనే వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల కండరాలు విరిగిపోతాయి. ఆ సమయంలో టెస్టు జట్టులో చోటు కోసం ఫోకస్ పెట్టిన నేను దేశవాళీ క్రికెట్, ‘ఏ’ జట్టుకు ఆడుతున్నాను. అయితే, అప్పుడు ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధానత్య ఇచ్చేవాడిని రికవరీని నిర్లక్ష్యం చేశాను. దీంతో కండరాలపై ఒత్తిడి పెరిగి విరిగిపోయాయి. నరాలు బిగుతుగా మారాయి.’అని చెప్పాడు.

భారత్ ‘ఏ’ జట్టుతో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు పరిస్థితి మరింత విషమించిందని చెప్పుకొచ్చాడు. ‘ఆ మ్యాచ్‌లో నొప్పిని భరిస్తూనే సెంచరీ చేశా. కానీ, ఆ తర్వాత నా కళ్ల నుంచి నీళ్లు రావడం మొదలైంది. నా వేళ్లు పనిచేయడం మానేశాయి. అంతా బండలా మారిపోయింది. రిటైర్డ్ హర్ట్‌గా వచ్చాను. నా వేళ్లు కదలకపోవడంతో గ్లోవ్స్‌ను కత్తిరించారు.’అని వివరించాడు. ఆ సమయంలో అప్పటి బీసీసీఐ సెక్రెటరీ జై షా, ముంబై ఇండియన్స్ నుంచి ఆకాశ్ దీప్ ఎంతో సహాయం చేశారని గుర్తు చేసుకున్నాడు. ‘ముంబై ఇండియన్స్, జై షాకు కృతజ్ఞతలు. నన్ను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ఇంకా ఆలస్యం చేసి ఉంటే ప్రాణాలకు ప్రమాదంగా మారేదని వైద్యలు చెప్పారు. అప్పుడు నా పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. నరాలు బిగుతుగా మారడంతో సూదులు వేస్తుంటే విరిగిపోయాయి.’అని తిలక్ తాను ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితిని వివరించాడు.

Next Story