కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే.. కీలక వ్యాఖ్యలు చేసిన భారత కోచ్

by Harish |

కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే.. కీలక వ్యాఖ్యలు చేసిన భారత కోచ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉంటే కచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉంటారని టీమిండియా అసిస్టెంట్ కోచ్ మోర్నె మోర్కెల్ తెలిపాడు. రాంచీలో గురువారం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మోర్కెల్ మాట్లాడుతూ.. వారిద్దరూ క్వాలిటీ ప్లేయర్లు అని, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వారి అనుభవానికి ప్రత్యామ్నాయం లేదన్నాడు. ‘వాళ్లు ట్రోఫీలు గెలిచారు. వారికి పెద్ద టోర్నీలు ఎలా ఆడాలో తెలుసు. వారిద్దరూ కష్టపడి ఫిట్‌నెస్ మెయింటెన్ చేయాలి.’అని తెలిపాడు.

సౌతాఫ్రికా మాజీ పేసర్ అయిన మోర్కెల్.. కోహ్లీ, రోహిత్‌లకు బౌలింగ్ చేసిన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘వారితో చాలా మ్యాచ్‌లు ఆడా. వాళ్లు నాకు ఎన్నో నిద్రలేని రాత్రులు ఇచ్చారు. బౌలర్‌గా వారితో ఆడాలంటే ఏ విధంగా సన్నద్ధం కావాలో నాకు తెలుసు.’అని చెప్పాడు. అలాగే, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమిపై స్పందిస్తూ.. రెండు వారాలు చాలా నిరాశపరిచాయన్నాడు. అయితే, వైట్‌బాల్ క్రికెట్‌లో తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని, రోహిత్, కోహ్లీ రాకతో కొత్త శక్తి వచ్చిందన్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయంపై మోర్కెల్ అప్‌డేట్ ఇచ్చాడు. గిల్ కోలుకుంటున్నాడని, అయ్యర్ పునరావాసం ప్రారంభించాడని చెప్పాడు. వారిద్దరూ తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపాడు.


Next Story