బీసీసీఐ కార్యాలయంలో చోరీ

by Yella Dhawani Reddy |

ముంబైలోని వాంఖడే స్టేడియంలోని బీసీసీఐ (BCCI) కార్యాలయంలో చోరీ జరిగింది.

బీసీసీఐ కార్యాలయంలో చోరీ
X

దిశ, వెబ్ డెస్క్: ముంబైలోని వాంఖడే స్టేడియంలోని బీసీసీఐ (BCCI) కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయంలోని మెర్చండైజ్ స్టోర్‌ నుంచి ఐపీఎల్ (IPL) 2025కి సంబంధించిన 261 జెర్సీలు (Jersey) దొంగలించబడ్డాయి. ఒక్కో జెర్సీకి దాదాపు రూ.2,500 ధర ఉంటుందని, మొత్తం వీటి విలువ దాదాపు రూ.6.5 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. ఈ ఘటన జూన్ 13న జరిగినప్పటికీ.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ కార్యాలయంలో స్టాక్ ఆడిట్ నిర్వహించినప్పుడు పలు వస్తువులు కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే బీసీసీఐ అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. సెక్యూరిటీ గార్డు ఫారూక్ అస్లామ్ ఖాన్ ఒక భారీ కార్డ్‌బోర్డ్ పెట్టెను లాక్కెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో జూన్ 17న మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. జెర్సీలను విక్రయించి, ఆ డబ్బుతో ఆన్‌లైన్ జూదం ఆడినట్లుగా అంగీకరించాడు. అతడి వద్ద నుంచి ఇప్పటివరకు పోలీసులు కేవలం 50 జెర్సీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ జెర్సీలు ఆటగాళ్ల కోసం ఉంచినవా లేదా అభిమానుల కోసం సిద్ధం చేసినవా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇక సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయాలను ధ్రువీకరించడానికి పోలీసులు ప్రస్తుతం అతని బ్యాంక్ ఖాతా వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Next Story