Badminton : ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్ జోడీ

by Harish |

Badminton : ఫైనల్‌కు దూసుకెళ్లిన సాత్విక్ జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ డబుల్స్ షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి థాయిలాండ్ ఓపెన్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచారు. టోర్నీలో సంచలన ప్రదర్శన చేస్తున్న ఈ భారత జంట శనివారం ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 19-21, 22-20, 21-16 తేడాతో మలేసియాకు చెందిన గో స్జే ఫే-నూర్ ఇజ్జుద్దీన్ జంటపై అద్భుత విజయం సాధించింది. గంటా 22 నిమిషాలపాటు సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్ ఫైనల్ చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. తొలి గేములో పోరాడినప్పటికీ నిరాశే ఎదురైంది. కానీ, ఆ తర్వాత బలంగా పుంజుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ పట్టుదల ప్రదర్శించారు. మలేసియా ప్లేయర్లను రెండు, మూడు గేముల్లో నిలువరించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. సాత్విక్ జోడీ ఈ సీజన్‌లో ఓ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. 2024లో భారత జంట తొలిసారి థాయిలాండ్ ఓపెన్ గెలిచింది. ఈ సారి రెండో టైటిల్‌ను దక్కించుకోవాలని చూస్తోంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాండో-డానియెల్ మార్టిన్ జోడీతో తలపడనుంది.


Next Story