Badminton : సింధుకు షాక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన సాత్విక్ జోడీ

by Harish |

Badminton : సింధుకు షాక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన సాత్విక్ జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి దూకుడు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి సెమీస్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో సాత్విక్ జోడీ 21-12, 21-13 తేడాతో జపాన్‌కు చెందిన తకుమి నోమురా, యుయిచి షిమోగామిలను చిత్తు చేసింది. 41 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్ రెండు గేముల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించారు. సాత్విక్ జోడీ ఈ ఏడాది ఓ టోర్నీలో సెమీస్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. 2024‌లో విజేతగా నిలిచిన భారత జంట రెండో టైటిల్ దిశగా సాగుతోంది.

సింధు, లక్ష్యసేన్‌కు షాక్

సింగిల్స్‌లో భారత్ పతక ఆశలు గల్లంతయ్యాయి. ఇద్దరు స్టార్ ప్లేయర్లు సింధు, లక్ష్యసేన్ క్వార్టర్స్‌లో ఇంటిదారిపట్టారు. జపాన్ క్రీడాకారిణి యమగూచి 19-21, 21-18, 21-15 తేడాతో సింధు పోరాడి ఓడింది. తొలి గేము నెగ్గి శుభారంభమే చేసినప్పటికీ మిగతా రెండు గేముల్లో ప్రత్యర్థిని నిలువరించలేకపోయింది. గంటకుపైగా సాగిన ఈ పోరులో సింధు పోరాటం ఫలించలేదు. ఇక, లక్ష్యసేన్ థాయిలాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్సార్న్ చేతిలో 21-19, 21-16 తేడాతో ఓటమిని అంగీకరించాడు. ఇప్పటికే శ్రీకాంత్, ఆయుశ్ శెట్టి, మాళవిక బాన్సోద్ నిష్ర్కమించిన విషయం తెలిసిందే. సింధు, సేన్ కూడా ఓడిపోవడంతో ఈ టోర్నీలో ఇక భారత ఆశలు సాత్విక్, చిరాగ్‌లపైనే ఉన్నాయి.


Next Story