‘రామోజీ’లో TG20 లీగ్ మెగా వేలం.. సిరాజ్, తిలక్ వర్మల కోసం ఫ్రాంచైజీల పోటీ

by Kema Shiva Kumar |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మక 'TG-20 లీగ్' మెగా వేలానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది.

‘రామోజీ’లో TG20 లీగ్ మెగా వేలం.. సిరాజ్, తిలక్ వర్మల కోసం ఫ్రాంచైజీల పోటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ క్రికెట్ అభిమానులకు సరికొత్త టీ20 మజాను అందించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘TG-20 లీగ్’ మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ప్లేయర్ల వేలం జరగనుంది. ఈ మెగా ఆక్షన్‌లో లీగ్‌కు చెందిన 8 ఫ్రాంచైజీల ఓనర్లు, టీజీ-20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్, హెచ్‌సీఏ ప్రతినిధులు పాల్గొని ఆటగాళ్లను సొంతం చేసుకోనున్నారు. ఈ వేలంలో మొత్తం 160 మంది క్రికెటర్లు భాగం కాబోతున్నారు. భారత స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, యువ సెన్సేషన్ తిలక్ వర్మతో పాటు ఆరోన్ జార్జ్, సీవీ మిలింద్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు వేలంలో నిలిచారు. దీంతో ఈ స్టార్ ప్లేయర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ ప్రొఫెషనల్ ఆక్షనీర్ చారు శర్మ ఈ వేలం ప్రక్రియను నిర్వహించనుండటం విశేషం.

వేలం నిబంధనలు.. బడ్జెట్ వివరాలు

ఆక్షన్‌లో ప్రతి ఫ్రాంచైజీకి గరిష్టంగా రూ.60 లక్షల పర్స్ వ్యాల్యూ కేటాయించారు. నిబంధనల ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ తమ బడ్జెట్ నుంచి కనీసం రూ.54 లక్షలు కచ్చితంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలు 8 జట్లు తలపడనున్నాయి. అందులో రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్, పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసెస్ జట్లుగా డివైడ్ చేశారు. ఈ మెగా లీగ్ మ్యాచ్‌లు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లను హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగానే నిర్వహించనున్నారు. లోకల్ టాలెంట్‌‌ను వెలికితీయడంతో పాటు, అభిమానులకు ఐపీఎల్ తరహా వినోదాన్ని అందించడమే లక్ష్యంగా హెచ్‌సీఏ ఈ లీగ్‌ను నిర్వహిస్తోంది.

Next Story