- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND VS SA : తెలుగు కుర్రాడు నితీశ్‌కు షాక్.. తుది జట్టులో పంత్, జురెల్‌కు చాన్స్
ఇటీవల ఆస్ట్రేలియా టూరు ముగించుకున్న టీమిండియా మళ్లీ టెస్టులు ఆడేందుకు సిద్ధమైంది.

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల ఆస్ట్రేలియా టూరు ముగించుకున్న టీమిండియా మళ్లీ టెస్టులు ఆడేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. కోల్‌కతా వేదికగా రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభకానుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టుపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రిషబ్ పంత్ రాకతో ధ్రువ్ జురెల్‌కు తుది జట్టులో స్థానంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ క్లారిటీ ఇచ్చాడు. తొలి టెస్టులో ఇద్దరూ ఆడనున్నట్టు హింట్ ఇచ్చాడు. ‘పంత్, ధ్రువ్ ఆడకపోతే నేను ఆశ్చర్యపోతాను. గత ఆరు నెలలుగా ధ్రువ్ అద్భుతంగా ఆడుతున్నాడు. గత వారంలో బెంగళూరులో రెండు సెంచరీలు బాదాడు. తొలి టెస్టులో అతను ఆడతాడు.’అని టెన్ డోస్చేట్ తెలిపాడు. ఇంగ్లాండ్ టూరులో గాయపడిన పంత్ ఈ సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇంతకుముందు సౌతాఫ్రికా ‘ఏ’తో సిరీస్‌లో ఫామ్ నిరూపించుకున్నాడు. అంతేకాకుండా పంత్ భారత జట్టుకు వైస్ కెప్టెన్. కాబట్టి, తుది జట్టు నుంచి అతన్ని తప్పించడం కుదరుదు. ఇక, గాయం కారణంగా పంత్ దూరమైన వేళ జురెల్ అతని స్థానాన్ని భర్తీ చేశాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో శతకం బాదాడు. ఇటీవల సౌతాఫ్రికా ‘ఏ’తో రెండో టెస్టులో రెండు సెంచరీలతో సత్తాచాటాడు. కాబట్టి, అతన్ని కూడా తప్పించలేని పరిస్థితి. పంత్, జురెల్ ఇద్దరిని తొలి టెస్టు ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తుంది. మంచి ఫామ్‌లో ఉన్న జురెల్‌ను ఆడించడం వల్ల భారత లోయర్ ఆర్డర్ కూడా బలంగా మారుతుంది.
తొలి టెస్టు నుంచి నితీశ్ ఔట్
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో స్థానం కరువైంది. తొలి టెస్టుకు అతను దూరంగా ఉండనున్నట్టు కోచ్ టెన్ డోస్చేట్ తెలిపాడు. ‘నితీశ్‌పై మా ఆలోచనలో ఎలాంటి మార్పు లేదు. ఆస్ట్రేలియాలో అతనికి ఎక్కువగా ఆడే చాన్స్ రాలేదు. ఈ సిరీస్ ప్రాముఖ్యత, పరిస్థితుల కారణంగా తొలి టెస్టులో అతను ఆడకపోవచ్చు.’అని చెప్పాడు. జట్టు వ్యూహంలో భాగంగానే తుది జట్టు ఎంపిక ఉంటుందని తెలిపాడు. తొలి టెస్టు జట్టు నుంచి కూడా నితీశ్‌ను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. మొదటి టెస్టులో బెంచ్‌కే పరిమితం కానున్న నేపథ్యంలో అతని సేవలను భారత్ ‘ఏ’ జట్టుకు వినియోగించుకోవాలని చూస్తోంది. సౌతాఫ్రికా ‘ఏ’తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. రాజ్‌కోట్‌లో ఈ మ్యాచ్ జరగనుండగా నితీశ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టు సమాచారం.
భారత్ 16.. సౌతాఫ్రికా 18
టెస్టుల్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది. ఇరు జట్లు 44 మ్యాచ్‌ల్లో తలపడగా అందులో భారత్ 16 విజయాలు నమోదు చేసింది. 18 విజయాలతో సౌతాఫ్రికాది పైచేయి. మరో 10 టెస్టులు డ్రా అయ్యాయి. అయితే, భారత్‌లో మాత్రం టీమిండియాదే ఆధిపత్యం. ఇండియాలో ఇరు జట్లు 19 సార్లు ఎదురుపడగా భారత్ 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. సౌతాఫ్రికా 5 విజయాలే సాధించగా.. మరో మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్‌లో చివరిసారిగా 2019-20లో జరిగిన సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.






