ఓటమిలేని కెప్టెన్‌గా బవుమా రికార్డు.. ముచ్చటగా మూడో విజేత సౌతాఫ్రికా!

by Phanindra |

డబ్ల్యూటీసీ ఫైనల్ విజయంతో కెప్టెన్‌ బవుమా అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ముచ్చటగా మూడో డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది.

ఓటమిలేని కెప్టెన్‌గా బవుమా రికార్డు.. ముచ్చటగా మూడో విజేత సౌతాఫ్రికా!
X

డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవడంతో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా అరుదైన ఘనత సాధించాడు. 2023లో టెస్టు కెప్టెన్సీ అందుకున్న బవుమా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో కలిపి మొత్తం 10 మ్యాచుల్లో జట్టుకు సారధ్యం వహించాడు. వీటిలో 9 విజయాలు సాధించిన అతను ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఇలా కెప్టెన్సీ చేసిన పది మ్యాచుల్లో ఓటమెరుగని రెండో కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆసీస్ లెజెండ్ వార్‌విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ తన కెప్టెన్సీలో ఆడిన 10 మ్యాచుల్లో 8 విజయాలు, రెండు డ్రాలు నమోదు చేశాడు.

హేజిల్‌వుడ్ రికార్డు బ్రేక్..

ఆసీస్ స్టార్ పేసర్ హేజిల్‌వుడ్ ఆడిన ఏ ఫైనల్‌లోనూ ఓడిపోలేదు. ఏ ఫార్మాట్లో అయినా అతను ఉన్న జట్టు ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ వాళ్లదే. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఈ రికార్డు కూడా బ్రేక్ అయింది. ఐసీసీ టోర్నీల ఫైనల్‌లో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు కూడా 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ముచ్చటగా మూడో విజేత..

డబ్ల్యూటీసీలో ముచ్చటగా మూడో విజేతకు టైటిల్ దక్కింది. టెస్టుల్లో ఆసక్తిని పెంచడం కోసం డబ్ల్యూటీసీ విధానం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జరిగిన మూడో ఫైనల్ మ్యాచ్ ఇది. ఈ మూడు సార్లు మూడు వేర్వేరు జట్లు టైటిల్ గెలవడం గమనార్హం. తొలిసారి 2021లో టీమిండియాను ఓడించి న్యూజిల్యాండ్ విజేతగా నిలిచింది. 2023లో కూడా భారత్‌నే ఓడించిన ఆస్ట్రేలియా టైటిల్ ఎగరేసుకుపోయింది. ఇక ఇప్పుడు ఆసీస్‌ను ఓడించిన సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ విజేగా నిలిచింది.

Next Story