ఆసియా క్రీడలకు భారత ఆర్చరీ జట్టు ఎంపిక.. పెద్దపల్లి అమ్మాయికి చోటు

by Harish |

ఆసియా క్రీడలకు భారత ఆర్చరీ జట్టు ఎంపిక.. పెద్దపల్లి అమ్మాయికి చోటు
X

దిశ, స్పోర్ట్స్ : జపాన్‌లో సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియా క్రీడలకు తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత ఎంపికైంది. హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న సాయ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం 12 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఆ జట్టులో పెద్దపల్లి జిల్లాకు చెందిన తానిపర్తి చికితకు చోటు దక్కింది. గతేడాది నుంచి అంతర్జాతీయ వేదికపై ఆమె సంచలన ప్రదర్శన చేస్తుంది. 2025‌లో కెనడాలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్‌లో ఆమె అండర్-21 వరల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ఆర్చర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. అలాగే, చైనాలో జరిగిన ఆర్చీర వరల్డ్ కప్‌లో టీమ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నెం, ధీరజ్ బొమ్మదేవర‌లకు చోటు దక్కింది. పురుషుల రికర్వ్ కేటగిరీలో ధీరజ్, నీరజ్ చౌహాన్, యశ్‌దీప్ భోంగె.. మహిళల రికర్వ్ కేటగిరీలో కీర్తి శర్మ, కుమ్‌కుమ్ అనిల్ మొహద్, అంకిత భకత్ సెలెక్ట్ అయ్యారు. పురుషుల కౌంపౌండ్‌ కేటగిరీలో సాహిల్ జాదవ్, కౌశల్ దలాల్, తిరుమురు గణేశ్ మణిరత్నం.. మహిళల కాంపౌండ్ కేటగిరీలో జ్యోతి సురేఖ, చికిత తానిపర్తి, ప్రతిక ప్రదీప్‌ ఎంపికయ్యారు. అయితే, పలువురు స్టార్ ప్లేయర్లకు నిరాశ తప్పలేదు. దీపిక కుమారి, అతాను దాస్ ట్రయల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి చోటు కోల్పోయారు. డిఫెండింగ్ ఆసియా గేమ్స్ చాంపియన్ ఓజాస్ డియోటాలే కూడా స్థానం దక్కలేదు. ట్రయల్స్‌లో అతను ఐదో స్థానంతో సరిపెట్టాడు. ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన జట్టే వరల్డ్ కప్ స్టేజ్ 3, 4 టోర్నీల్లోనూ పాల్గొంటుంది. 2023‌లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆర్చరీలో భారత్ 9 పతకాలు గెలిచింది.

Next Story