లార్డ్స్‌లో టీమిండియా చారిత్రక విజయం.. ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చిత్తు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-13 12:02:18  IST  )

చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది.

లార్డ్స్‌లో టీమిండియా చారిత్రక విజయం.. ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చిత్తు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ (Lords) మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టించింది. ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా (Team India) 270 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ స్మృతి మంధాన (83), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (58) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 3 వికెట్లు పడగొట్టింది.

దుమ్ములేపిన భారత బ్యాటర్లు..

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మరింత రెచ్చిపోయారు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా (113) అద్భుతమైన సెంచరీతో కదం తొక్కగా, స్మృతి మంధాన (70) మరోసారి హాఫ్ సెంచరీతో రాణించింది. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 341/7 వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ అమీ జోన్స్ (52) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, భారత యువ బౌలర్ క్రాంతి గౌడ్ 5 వికెట్లతో చెలరేగి ఇంగ్లాండ్‌ను 170 పరుగులకే పరిమితం చేసింది. ఈ అద్భుత ప్రదర్శనతో క్రాంతి గౌడ్ ప్రతిష్టాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డుపై చోటు సంపాదించుకుంది.

అదేవిధంగా రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే ఇంగ్లాండ్ తలవంచేసింది. ఈ ఇన్నింగ్స్‌లోనూ అమీ జోన్స్ (54) హాఫ్ సెంచరీతో పోరాడినప్పటికీ భారత సీనియర్ స్పిన్నర్ స్నేహ రాణా 4 వికెట్లతో మ్యాజిక్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. దీంతో భారత మహిళల జట్టు లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఏకైక టెస్టులో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Next Story